Deepavali Offers | న్యూఢిల్లీ, అక్టోబర్ 26: పండుగ సీజన్‌పై గంపెడు ఆశలు పెట్టుకున్న ఆటోమొబైల్ సంస్థలకు నిరాశే ఎదురైంది. దసరా నుంచి దీపావళి పండుగ సీజన్లో ఈసారి అమ్మకాలు భారీ స్థాయిలో ఉంటాయని ఆశించిన సంస్థలకు కొనుగోలుదారులు పెద్ద షాకిచ్చారు. దీంతో తమ వద్దవున్న స్టాక్స్‌ను వదిలించుకోవడానికి ఆటోమొబైల్ సంస్థలు ఏకంగా భారీ స్థాయిలో రాయితీలు ప్రకటించాయి. ప్రతియేటా పండుగ సీజన్లో అమ్మకాలు రెండంకెల వృద్ధిని నమోదు చేసుకున్న సంస్థలు.. ఈసారి మాత్రం సింగిల్ డిజిట్‌కు పరిమితం కావడంతో కస్టమర్లను ఆకట్టుకోవడానికి రూ.3 లక్షల వరకు డిస్కౌంట్‌ను ప్రకటించాయి. వీటిలో దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాలతోపాటు పలు విదేశీ సంస్థలు కూడా ఉన్నాయి. వీటి వివరాలు..
టాటా నెక్సాన్
దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన నెక్సాన్‌పై కూడా టాటా మోటర్స్ లక్ష రూపాయల వరకు రాయితీని ఇస్తున్నది. పెట్రోల్, డీజిల్, సీఎన్జీ, ఈవీ రకాల్లో లభించనున్న ఈ మాడల్‌పై రూ.16 వేల నుంచి రూ.లక్ష రూపాయల వరకు తగ్గింపు ధరతో విక్రయిస్తున్నది. దీంతోపాటు మై23 మాడల్‌పై అదనంగా రూ.15 వేల డిస్కౌంట్ ఇస్తున్నది.
నిస్సాన్ మ్యాగ్నైట్
నిస్సాన్ మ్యాగ్నైట్‌పై రూ.1.25 లక్షల వరకు తగ్గింపు ధరతో విక్రయిస్తున్నది. అమ్ముడిపోని ఇన్వెంటరీలను క్లీయర్ చేసుకోవడంలో భాగంగా ఈ ఎస్‌యూవీపై భారీగా రాయితీని కల్పిస్తున్నది సంస్థ. ప్రస్తుతం ఈ కారు రూ.6 లక్షల నుంచి రూ.10.66 లక్షల లోపు లభించనున్నది.
మారుతి గ్రాండ్ విటారా
కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకీ మధ్యస్థాయి ఎస్యూవీ హైబ్రిడ్ మాడల్ గ్రాండ్ విటారాను రూ.1.28 లక్షల వరకు తగ్గింపు ధరతో విక్రయిస్తున్నది.
కియా సెల్టోస్
కొరియాకు చెందిన ఆటోమొబైల్ సంస్థ కియా..తన ఎస్యూవీ మాడల్ సెల్టోస్‌పై రూ.1.3 లక్షల వరకు రాయితీని ఇస్తున్నది. దీంట్లో నగదు రాయితీతోపాటు ఎక్సేంజ్ బోనస్, విడిభాగాలపై ప్యాకేజీ కల్పిస్తున్నది. ఈ కారు రూ.10.90 -20.34 లక్షల ధరల శ్రేణిలో లభిస్తున్నది.
సిట్రాయిన్ సీ3 ఎయిర్‌క్రాస్
సిట్రాయిన్ సీ3 ఎయిర్క్రాస్పై రూ.1.5 లక్షల వరకు ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తున్నది సదరు కంపెనీ. మాన్యువల్, ఆటోమేషన్ ట్రాన్స్‌మిషన్‌లో ఈ వాహనం లభిస్తున్నది.
టాటా సఫారి
టాటా మోటర్ తన మాడల్ సఫారిపై రూ.50 వేల నుంచి రూ.1.4 లక్షల వరకు డిస్కౌంట్‌ను కల్పిస్తున్నది. ఈ ఎస్యూవీ మాడల్ రూ.15.49-27.34 లక్షల ధరల శ్రేణిలో లభిస్తున్నది.
ఎంజీ హెక్టార్
హెక్టార్ మాడల్‌తో దేశీయ మార్కెట్లోకి అడుగుపెట్టిన ఎంజీ మోటర్..కస్టమర్లను ఆకట్టుకోవడానికి భారీ స్థాయిలో రాయితీ ఇస్తున్నది. అన్ని రకాల మాడళ్లపై రూ.2 లక్షల వరకు తగ్గింపు ధరతో విక్రయిస్తున్నది. దీంతోపాటు గ్లోస్టర్ ఎస్‌యూవీపై రూ.6 లక్షల ధరను తగ్గించింది. దీంతో ధర రూ.38.80 లక్షల నుంచి రూ.43.16 లక్షలకు దిగొచ్చింది.
మారుతి జిమ్నీ
కొనుగోలుదారులను ఆకట్టుకోవడానికి జిమ్నీ మాడల్‌పై రూ.2.5 లక్షల వరకు డిస్కౌంట్‌ను ప్రకటించింది మారుతి సుజుకీ. ప్రస్తుతం ఈ కారు రూ.12.74 లక్షల నుంచి రూ.14.79 లక్షల మధ్యలో లభిస్తున్నది.
మహీంద్రా ఎక్స్‌యూవీ 400
మహీంద్రా తన తొలి ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఎక్స్‌యూవీ 400ని రూ.3 లక్షల వరకు ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తున్నది. 7.2 కిలోవాట్ల చార్జర్ కలిగిన మాడల్‌పై అత్యధికంగా రాయితీని ఇస్తున్నది.