Super Luxury Cars | ప్రతి ఒక్కరూ పర్సనల్ మొబిలిటీకి ప్రాధాన్యం ఇస్తున్నారు. స్పేసియస్ గా ఉండే ఎస్యూవీలు, మిడ్ సైజ్ ఎస్యూవీలు, ఎంపీవీలపై మోజు పారేసుకుంటున్నారు. అలాగే అన్ని రకాల సౌకర్యాలు గల లగ్జరీ కార్ల కొనుగోళ్లు ఏయేటికాయేడు పెరుగుతూనే ఉన్నాయి. వరుసగా మూడో ఏడాది సూపర్ లగ్జరీ కార్ల విక్రయాల్లో సరికొత్త రికార్డు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కార్ల తయారీ సంస్థలు తమ వద్ద ఉన్న నిల్వలను క్లియర్ చేసుకోవడానికి భారీ డిస్కౌంట్లు కూడా ఆఫర్ చేస్తున్నాయి.
కానీ ఇటలీ కార్ల తయారీ సంస్థ ‘లంబోర్ఘిని’ కారు ఇప్పుడు బుక్ చేసుకుంటే 2026లో గానీ, ఆ తర్వాత గానీ డెలివరీ అవుతుంది. ఇటలీ రాజధాని రోమ్ నగరంలోని లంబోర్ఘిని కార్ల తయారీ సంస్థలో తయారైన కార్లన్నీ ఇప్పటికే భారత్ కే కేటాయించింది. భారత్ లో హురాకెన్ (Huracan), ఉరుస్ (Urus), రెవ్యూల్టో (Revuelto) వంటి మోడల్ కార్లు లంబోర్ఘిని విక్రయిస్తోంది. వీటిల్లో ఒక్కో కారు ధర రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల మధ్య పలుకుతుంది.
ఇక ఫెర్రారీ, మెక్ లారెన్స్, ఆస్టన్ మార్టిన్ వంటి సంస్థల సూపర్ కార్లకు భారత్ లో బాగానే గిరాకీ ఉంది. రూ.2.5 కోట్ల నుంచి రూ.4.55 కోట్ల మధ్య ధర పలికే ఎఎంజీ జీ63, (AMG G 63), ఆర్ఎస్ క్యూ8 (RS Q8) మోడల్ మెర్సిడెజ్ బెంజ్, ఆడి కార్ల కోసం ఏడాది వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. రూ.4 కోట్ల విలువైన కార్లు 2021లో 300 యూనిట్లు అమ్ముడైతే, 2022లో 450కి, 2023లో 1000కి పెరిగాయి. ఈ ఏడాది 1200 నుంచి 1300 మధ్య సూపర్ లగ్జరీ కార్లు అమ్ముడవుతాయని అంచనా వేస్తున్నారు.
భారతీయుల్లో జనరేషన్ మైండ్ సెట్ మారుతోందని లంబోర్ఘిని సీఈఓ స్టీఫాన్ వింకెల్ మాన్ చెప్పారు. అందువల్లే లగ్జరీ కార్లకు గిరాకి పెరుగుతుందన్నారు. అయితే ఇతర మార్కెట్లతో పోలిస్తే భారత్ లో వృద్ధిరేటు సంకేతాలు కనిపిస్తున్నాయన్నారు. 2022 సేల్స్ తో పోలిస్తే 2023లో 12 శాతం వృద్ధితో 103 యూనిట్ల లంబోర్ఘిని కార్లు అమ్ముడయ్యాయి.