Scooters Segment | ద్విచక్ర వాహనాల మార్కెట్లో సుమారు 40 శాతం వాటా స్కూటర్ సెగ్మెంట్ సొంతం చేసుకుంటుందని టీవీఎస్ మోటార్ కంపెనీ అంచనా వేసింది. ఇటీవల న్యూ జ్యూపిటర్ 110 స్కూటర్ ఆవిష్కరణ సందర్భంగా కంపెనీ సీఈఓ కేఎన్ రాధాకృష్ణన్ మాట్లాడుతూ మొత్తం స్కూటర్ల విక్రయాల వృద్ధిరేటు 8 నుంచి 12 శాతానికి పెరిగిందన్నారు.
ప్రస్తుతం స్కూటర్ల క్యాటగిరీ సుమారు 32 శాతం పెరుగుతుందన్నారు రాధాకృష్ణన్. స్కూటర్ల మార్కెట్ గణనీయంగా విస్తరిస్తుందని నమ్ముతున్నట్లు తెలిపారు. మున్ముందు 40 శాతం మార్కెట్ వాటాను సొంతం చేసుకుంటుందన్నారు. పట్టణ, పల్లె ప్రాంతాల్లోనూ స్కూటర్ సెగ్మెంట్ వృద్ధి ఉంటుందని చెప్పారు.
ఫెస్టివ్ సీజన్ కొనుగోళ్లు చాలా బాగున్నాయన్నారు రాధాకృష్ణన్. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది పండుగల సీజన్ లో వృద్ధిరేటు సుమారు 12.5 శాతం ఉంటుందని అంచనా వేశారు. టీవీఎస్ మోటార్ కంపెనీ విడుదల చేసిన న్యూ జ్యూపిటర్ 110 స్కూటర్ రూ.73,700 (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభం అవుతుంది.