(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): అదానీ గ్రూప్ వ్యవహారం యావత్తు దేశాన్ని కుదిపేస్తున్నా.. ఆ గ్రూప్ కుట్రలు ఆగట్లేదన్న వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ ఆంగ్ల వార్తా వెబ్సైట్ ‘స్క్రోల్’ ప్రచురించిన పరిశోధనాత్మక కథనం ఇందుకు అద్దం పడుతున్నది. కేంద్ర ప్రభుత్వం గత నెలలో నిర్వహించిన బొగ్గు గనుల వేలంలో అదానీ గ్రూప్ కంపెనీ అక్రమాలకు పాల్పడిందని, అత్యంత చౌకగా నాలుగు కోల్ బ్లాక్‌లను చేజిక్కించుకొన్నదని స్క్రోల్ ఆరోపించింది.
దేశంలోని 141 బొగ్గు గనుల వేలానికి గత ఏడాది నవంబర్‌లో కేంద్ర ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించింది. అయితే వేలం ప్రక్రియలో పాల్గొన్న 59 కంపెనీలు.. 36 గనుల కోసం మొత్తం 96 బిడ్లు దాఖలు చేశాయి. గత నెల 9న వేలం ప్రక్రియ ముగిసేనాటికి 29 కోల్ బ్లాక్‌ల వేలం విజయవంతంగా పూర్తయినట్టు ప్రభుత్వం ప్రకటించింది. కానీ నిబంధనల ప్రకారం.. తొలిసారి వేలానికి వచ్చే గని ఫ్లోర్ ప్రైస్ ధర.. మైనింగ్ కంపెనీ ద్వారా వచ్చే ఆదాయంలో కనీసం 4 శాతంగానైనా ఉండాలి. అలాగే వేలంలో కనీసం రెండు పోటీదారు కంపెనీలైనా తప్పక పాల్గొనాలి. ఒకవేళ వేలానికి ఒక్క కంపెనీనే వస్తే సదరు గని వేలం ప్రక్రియనే రద్దు చేయాలి. అయితే 29 బొగ్గు గనుల వేలంలో 25 గనుల కోసం ఆయా కంపెనీలు దాఖలు చేసిన సగటు రెవెన్యూ షేర్ 22.12 శాతంగానే ఉన్నది. ఇక అదానీ గ్రూప్ కంపెనీలు గెలుచుకున్న నాలుగు బొగ్గు గనుల్లో మూడింటి రెవెన్యూ షేర్ 5.5 శాతంగానే ఉండటం గమనార్హం. మరొకదాని షేర్ 7 శాతంగా ఉన్నట్టు స్క్రోల్ వెల్లడించింది. ఈ గణాంకాలను విశ్లేషిస్తే.. మిగతా కంపెనీలతో పోల్చితే అదానీ కంపెనీలకు అగ్గువకే బొగ్గు గనులు దక్కినట్టు వెబ్సైట్ ఆరోపించింది. అంతేగాక నార్త్ వెస్ట్ ఆఫ్ మధేరీ బొగ్గు గని వేలంలో అదానీ కంపెనీకి పోటీగా బిడ్ వేసిన కావిల్ మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రమోటర్ ఉత్కర్ష్ షా.. అదానీ గ్రూప్‌నకు అనుబంధంగా పనిచేస్తున్నట్టు ‘హిండెన్‌బర్గ్’ ఆరోపించిన ‘అడీకార్ప్’ కంపెనీకి కూడా ప్రమోటరేనని ‘స్క్రోల్’ చెప్పడం గమనార్హం. ్మపురుంగా, దేహేగావ్ గోవారీ, గోండ్బహేరా ఉజేనీలోని బొగ్గు గనుల వేలంలోనూ అదానీ గ్రూప్ అక్రమాలకు పాల్పడిందని, అగ్గువకే గనులను చేజిక్కించుకొన్నదని ‘స్క్రోల్’ గట్టిగా వాదిస్తున్నది.
2011 కంటే ముందు జరిగిన 218 బొగ్గు గనుల లీజు ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ సుప్రీంకోర్టు రద్దు చేసిన బొగ్గు గనుల లీజుల్లో అదానీ కంపెనీలకు చెందిన ఐదు కాంట్రాక్టులు కూడా ఉన్నాయి. అందుకే అదానీ కంపెనీలకు లబ్ధి చేకూర్చాలన్న ఉద్దేశంతో కోల్ మైన్స్ స్పెషల్ ప్రొవిజన్స్ యాక్ట్ పేరిట మైన్ డెవలపర్ అండ్ ఆపరేటర్ (ఎండీవో) కాంట్రాక్టు పాలసీలో ప్రత్యేక నిబంధనలను కేంద్రం చేర్చినట్టు విశ్లేషకులు ఆరోపిస్తున్నారు. దీంతో సుప్రీంకోర్టు రద్దుచేసిన కాంట్రాక్టులను అదానీ కంపెనీలు కొనసాగించడానికి మార్గం సుగమమైనట్టు పేర్కొంటున్నారు. ఈ వివాదం కొనసాగుతుండగానే.. కొత్తగా మరో 4 బొగ్గు గనులను నిబంధనలకు విరుద్ధంగా అదానీ గ్రూప్ చేజిక్కించుకొన్నట్టు ‘స్క్రోల్’ పరిశోధనాత్మక కథనం బయటపెట్టడం దుమారం రేపుతున్నది.