హైదరాబాద్, ఏప్రిల్ 12: అమెరికాకు చెందిన విద్యుత్తు ఆధారిత వాహనాల (ఈవీ) తయారీ సంస్థ ఫిస్కర్.. హైదరాబాద్లో తమ భారతీయ ప్రధాన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ నాయకత్వంలోని బృందం.. గత నెల అమెరికాలో పర్యటించిన నేపథ్యంలోనే ఫిస్కర్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. కాగా, క్యాలిఫోర్నియా కేంద్రంగా నడుస్తున్న ఈ కంపెనీ.. ఇప్పటికే నియామకాల ప్రక్రియలోకీ దిగినట్టు ప్రకటించింది. దీంతో 200 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. ఫిస్కర్ రాకను మంత్రి కేటీఆర్ సైతం ట్విట్టర్ ద్వారా ధ్రువీకరించారు. తెలంగాణలో ఫిస్కర్ ఆపరేటింగ్ సంస్థగా ఉన్న ఫిస్కర్ విగ్యాన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్.. ఈ హైదరాబాద్ ఆఫీస్లో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, వర్చువల్ వెహికిల్ డెవలప్మెంట్ సపోర్ట్, ఎలక్ట్రానిక్స్ డాటా అనలిటిక్స్, మెషిన్ లెర్నింగ్ కార్యకలాపాలపై దృష్టి సారించనున్నది.
క్యాలిఫోర్నియాలోని ఫిస్కర్ ఇంజినీరింగ్, ప్రోడక్ట్ డెవలప్మెంట్ ప్లాంట్లతోనూ కలిసి హైదరాబాద్ కేంద్రం పనిచేస్తుందని మంగళవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో కంపెనీ తెలియజేసింది. మరికొద్ది వారాల్లోనే తమ దేశీయ కార్యకలాపాలు పూర్తిస్థాయిలో మొదలవుతాయని, ఇది భారతీయ మార్కెట్లో ఫిస్కర్ ఓషియన్, పియర్ ఈవీల ఆవిష్కరణకు దోహదం చేయగలదన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. ఇక భారత్లోకి మా విస్తరణ ఇరు దేశాల వ్యూహాత్మక మార్కెట్ అవకాశాలను ప్రతిబింబిస్తుందని వ్యాఖ్యానించింది. 2016 అక్టోబర్లో ఏర్పాటైన ఈ సంస్థ.. న్యూయార్క్ స్టాక్ ఎక్సేంజ్లోనూ నమోదైంది.
‘తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మా ధన్యవాదాలు. హైదరాబాద్లో మా కార్యకలాపాల ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి ఎంతగానో సహాయ,సహకారాలు అందాయి. ఇక్కడి ప్రధాన కేంద్రం మా సంస్థ అంతర్జాతీయ ఇంజినీరింగ్ సామర్థ్యాలకూ ప్రోత్సాహకరమే’
-హెన్రిక్ ఫిస్కర్, ఫిస్కర్ వ్యవస్థాపక చైర్మన్, సీఈవో