Fine On X | ప్రముఖ సోషల్ మీడియా ‘ఎక్స్’కు యూరోపియన్ యూనియన్ షాక్ ఇచ్చింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’పై 120 మిలియన్ యూరోల జరిమానా విధించింది. డిజిటల్ సర్వీసెస్ చట్టం (DSA) నియమాలను ఉల్లంఘించిందని విచారణలో తేలడంతో జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకుంది. 27 దేశాల యూరోపియన్ యూనియన్‌లో డిజిటల్ సర్వీసెస్ చట్టం కింద ఒక ప్లాట్‌ఫామ్‌పై నిబంధనలు పాటించడం లేదంటూ చర్యలు తీసుకోవడం ఇదే మొదటిసారి. డీఎస్ఏ సోషల్ మీడియా కంపెనీలను యూజర్ల సెక్యూరిటీని నిర్ధారించాలని.. తప్పుడు సమాచారం, చట్టవిరుద్ధమైన కంటెంట్‌ను ప్లాట్‌ఫామ్ నుంచి తొలగించాలని నిబంధనలు చెబుతున్నాయి. నిబంధనలు ఉల్లంఘిస్తే గణనీయమైన జరిమానాలు విధిస్తారు.
యూరోపియన్ యూనియన్ కమిషన్ ప్రకారం.. గతంలో ఎక్స్ బ్లూ టిక్‌ను రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, వెరిఫైడ్ అకౌంట్స్‌కు మాత్రమే ఇచ్చింది. కానీ, ప్రస్తుతం ఎనిమిది డాలర్లు చెల్లించి ఎవరైనా ఈ బ్యాడ్స్ను ఇస్తుందని ఆరోపిస్తున్నది. ఈ వ్యవస్థ నిజమైన వినియోగదారులను ధ్రువీకరించడం లేదని.. ఫేక్ అకౌంట్స్‌ను గుర్తించడం కష్టతరం చేస్తుందని కమిషన్ తెలిపింది. డేటాబేస్ తగినంత సమాచారాన్ని అందించడం లేదని ఈయూ వాదిస్తున్నది. అనేక సాంకేతిక అడ్డంకులు పరిశోధకులు డేటాను యాక్సెస్ చేయకుండా చేస్తున్నాయని.. నకిలీ ప్రకటనలు, తప్పుడు సమాచార ప్రచారాలను గుర్తించడం కష్టతరం చేస్తుందని ఈయూ చెబుతున్నది. దాంతో డేటాను యాక్సెస్ చేయడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని కమిషన్ పేర్కొంది. ఈయూ వైస్ ప్రెసిడెంట్ హెన్నా విర్క్కునెన్ మాట్లాడుతూ.. బ్లూ టిక్‌లతో వినియోగదారులను తప్పుదారి పట్టించడం, ప్రకటన సమాచారాన్ని దాచడం, రీసెర్చర్స్ను అడ్డుకోవడం యూనియన్‌లో ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది.