ముంబై, జనవరి 27: తీవ్ర ఒడిదుడుకుల నడుమ దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. భారత్-యూరోపియన్ యూనియన్ (ఈయూ) మధ్య ఎన్నో ఏండ్ల నుంచి పెండింగ్లో ఉంటూ వస్తున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్టీఏ) ఎట్టకేలకు కుదిరిన నేపథ్యంలో మంగళవారం మదుపరులు పెట్టుబడులకు ఆసక్తి కనబర్చారు.
నిజానికి ఉదయం ఆరంభంలో అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితుల ప్రభావంతో ఇన్వెస్టర్లు అమ్మకాలకే పెద్దపీట వేశారు. అయితే సమయం గడుస్తున్నకొద్దీ కొనుగోళ్లకు మద్దతిచ్చారు. ఈ క్రమంలోనే సోమవారం ముగింపుతో పోల్చితే బీఎస్ఈ ప్రధాన సూచీ సెన్సెక్స్ 319.78 పాయింట్లు లేదా 0.39 శాతం ఎగిసి 81,857.48 వద్ద స్థిరపడింది. అయితే ట్రేడింగ్లో 81,088.59 పాయింట్ల కనిష్ఠాన్ని, 82,084.92 పాయింట్ల గరిష్ఠాన్ని సూచీ తాకింది. అలాగే ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 126.75 పాయింట్లు లేదా 0.51 శాతం ఎగబాకి 25,175.40 వద్ద నిలిచింది.
ఈయూతో భారత్ ఎఫ్టీఏ నేపథ్యంలో ఆటో స్టాక్స్.. అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. దేశీయ మార్కెట్లోకి ఐరోపా దేశాల నుంచి ఇకపై లగ్జరీ కార్లు చౌకగా దిగుమతి అవుతాయన్న అభిప్రాయాలే ఇందుకు కారణం. ఆయా కార్ల ధరలు తగ్గితే మార్కెట్లో గట్టి పోటీ తప్పదన్న అంచనాల నడుమ మహీంద్రా అండ్ మహీం ద్రా, హ్యుందాయ్, మారు తి సుజుకీ, టాటా మోటర్స్ తదితర షేర్లు సెల్లింగ్ ప్రెషర్ను చూశాయి. ఈ క్రమంలోనే మహీంద్రా 4.19 శాతం, హ్యుందాయ్ 4.02 శాతం, మారుతి 1.48 శాతం, టాటా మోటర్స్ 1.22 శాతం చొప్పున నష్టపోయాయి.