న్యూఢిల్లీ, ఆగస్టు 23: ఎనర్జీ, సహజ వనరులు తదితర వ్యూహాత్మక రంగాల్లో నిర్దేశిత పరిమితికి మించి భారతీయ కార్పొరేట్ సంస్థలు విదేశీ పెట్టుబడులు పెట్టవచ్చని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మంగళవారం ప్రకటించింది. అయితే కావాల్సిన అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతే ఇది సాధ్యమని స్పష్టం చేసింది.
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి నియమ, నిబంధనలు 2022పై ఓ వివరణాత్మక ప్రకటనను ఆర్థిక శాఖ విడుదల చేసింది. బ్యాంకింగ్, బీమా మినహా ఆర్థిక సేవల కార్యకలాపాల్లో ఉన్న విదేశీ సంస్థలో ఆటోమేటిక్ మార్గం ద్వారా దేశీయ ఆర్థిక రంగేతర సంస్థ ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టవచ్చని ఈ సందర్భంగా వెల్లడించింది. ఇంతకుముందు ఆర్థిక సేవల్లో ఉన్న విదేశీ సంస్థలో భారతీయ ఆర్థిక రంగేతర సంస్థ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతే ఉండేది కాదన్న విషయం తెలిసిందే.