Elon Musk on Trump | ట్విట్టర్‌ను టేకోవర్ చేసుకోనున్న టెస్లా సీఈవో ఎలన్‌మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకసారి ట్విట్టర్ కొనుగోలు ఒప్పందం పూర్తయితే అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖాతాను పునరుద్ధరిస్తామని సూత్రప్రాయంగా చెప్పారు. కార్ల భవితవ్యంపై ఓ ఆంగ్ల దినపత్రిక నిర్వహించిన కార్యక్రమంలో ఎలన్‌మస్క్ మాట్లాడుతూ.. ట్రంప్‌పై ట్విట్టర్ శాశ్వత నిషేధం విధించడం తప్పుడు నిర్ణయం అన్నారు. ఇది ట్విట్టర్‌పై యూజర్ల విశ్వాసాన్ని తగ్గించేస్తుందని చెప్పారు. తప్పుడు, చెడు ట్వీట్లు ఉంటే వాటిని తొలగించడం గానీ, కనిపించకుండా చేయడం గానీ చేపట్టాలి. అంతేతప్ప శాశ్వతంగా నిషేధం విధించకూడదన్నారు. ట్రంప్ ట్విట్టర్ ఖాతాపై నిషేధం విధించడం సరి కాదని తాను భావిస్తున్నానని, అది పొరపాటు నిర్ణయం అని పేర్కొన్నారు.
ఎలన్‌మస్క్ 44 బిలియన్ డాలర్లకు ట్విట్టర్‌ను కొనుగోలు చేయడానికి ఆ సంస్థ డైరెక్టర్ల బోర్డు గతనెలలో ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ ఒప్పందానికి రెగ్యులేటరీ సంస్థల ఆమోద ముద్ర లభించాలి. ఈ నేపథ్యంలోనే ఎలన్‌మస్క్‌కు ట్విట్టర్‌ను కొనాలని ట్రంప్ సలహా ఇచ్చారని వార్తలొచ్చాయి. ఈ వార్తలను ఎలన్‌మస్క్ ఖండించారు. దీనిపై తాను ఏనాడూ ట్రంప్‌తో మాట్లాడలేదన్నారు. ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ట్రంప్‌తో మాట్లాడనే లేదన్నారు.
ట్విట్టర్‌తో కొనుగోలు ఒప్పందం పూర్తయిన తర్వాత ట్రంప్ ఖాతాను పునరుద్ధరించడానికి ఎలన్‌మస్క్ చర్యలు తీసుకుంటారని కూడా వార్తలొచ్చాయి. దీనిపై ట్రంప్ స్పందించారు. వ్యక్తిగతంగా ఎలన్‌మస్క్ అంటే చాలా ఇష్టమని, తన పట్ల ట్విట్టర్ వ్యవహరించిన తీరుపై తాను అసంతృప్తికి గురయ్యానన్నారు. ఒకవేళ ట్విట్టర్లోకి అనుమతించినా తాను రానని ట్రంప్ వ్యాఖ్యానించారు.