Elon Musk No Home | ఎలన్‌మస్క్.. పరిచయం అక్కర్లేని పేరు.. ప్రపంచంలోనే అతిపెద్ద బిలియనీర్.. కానీ ఆయన సొంతింటిని ఏర్పాటు చేసుకోలేక పోయారట. మిత్రుల ఇండ్లలోనే బస చేస్తున్నట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మస్క్ స్వయంగా చెప్పారు. ఇప్పుడు తనకు సొంత స్థలమంటూ ఏమీ లేదని, తన మిత్రుల ఇండ్లలో ఉంటున్నా అని అన్నారు. టెస్లా పనిమీద వెళ్లినప్పుడు స్నేహితుల ఇండ్లలో ఖాలీగా ఉన్న బెడ్రూమ్స్లో ఉంటానని తెలిపారు.
తాను అసలు విహార యాత్రలకే వెళ్లనని, కానీ, విహరించడానికి సొంతంగా నౌక లేదన్నారు మస్క్. ప్రపంచ వ్యాప్త ఆర్థిక అసమానతలు, కుబేరుల ఖర్చుపై సదరు ఇంటర్వ్యూలో ఎదురైన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తాను వ్యక్తిగత అవసరాలకు ఎక్కువ డాలర్లు ఖర్చు చేస్తే అది సమస్యాత్మకంగా మారుతుందన్నారు. తనకు ఒక విమానం ఉందని, దాన్ని తాను వాడకపోతే కొన్ని గంటల సేపు మాత్రమే పని చేయాల్సి వస్తుందని ఎలన్‌మస్క్ అన్నారు.
స్పేస్ ఎక్స్ నుంచి తీసుకున్న ఓ అద్దె ఇల్లే తనకు నివాసం అని గతేడాది ఓ ట్వీట్లో ఎలన్‌మస్క్ చెప్పారు. ఫోర్బ్స్ గణాంకాల ప్రకారం టెస్లా సీఈవో ఎలన్‌మస్క్ వ్యక్తిగత సంపద 269.5 బిలియన్ల డాలర్లు. ఇక సోషల్ మీడియా వేదిక ట్విట్టర్‌ను టేకోవర్ చేసేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు అంతటా చర్చనీయాంశం అయ్యాయి.