న్యూఢిల్లీ : టెక్ ప్రపంచంలో లేఆఫ్స్ కలకలం కొనసాగుతోంది. తాజాగా ఈ-కామర్స్ దిగ్గజం ఈబే ప్రపంచవ్యాప్తంగా 500 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించనుంది. మొత్తం ఉద్యోగుల్లో నాలుగు శాతం మందిపై వేటు వేయాలని కంపెనీ నిర్ణయించింది.
ఈబే కొలువుల కోతలో భారత్‌లో ఎంతమంది ఉద్యోగులు ప్రభావితం అవుతారు..ఏయే విభాగాల్లో ఉద్యోగులను తొలగిస్తారనే వివరాలు ఇంకా వెల్లడికాలేదు. 1995లో ఈకామర్స్ దిగ్గజ కంపెనీ ఈబే కాలిఫోర్నియా ప్రధాన కార్యాలయంగా ఏర్పాటైంది. ఈ కంపెనీ కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ నుంచి ఫ్యాషన్ వస్తువులు, గృహోపకరణాలు, గిఫ్ట్ ఐటెమ్స్ వరకూ పలు వస్తువులు, ఉత్పత్తులను విక్రయిస్తుంది.
ఈబేలో లేఆఫ్స్ వార్తలను కంపెనీ సీఈఓ జేమి జెనోన్ ధ్రువీకరించారు. మరోవైపు ఈబేతో పాటు వీడియో కాలింగ్ ప్లాట్‌ఫాం జూమ్ సైతం లేఆఫ్స్‌ను ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా 1300 మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు కంపెనీ సీఈఓ ఎరిక్ యువాన్ వెల్లడించారు. జూమ్ ఉద్యోగుల్లో 15 శాతం మందిని కంపెనీ సాగనంపనుంది.