Nitin Gadkari | డ్రైవర్ లెస్ కార్లను భారత్‌లోకి అనుమతించబోమని కేంద్ర జాతీయ రహదారులు, రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ తేల్చి చెప్పారు. డ్రైవర్ లెస్ కార్ల వల్ల డ్రైవర్లకు ఉపాధి లేకుండా పోతుందన్నారు. మంగళవారం ఐఐఎం-నాగ్‌పూర్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో నితిన్ గడ్కరీ మాట్లాడుతూ రోడు ప్రమాదాల నివారణకు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వివరించారు.
డ్రైవర్ల ఉపాధిని దెబ్బ తీసే డ్రైవర్ లెస్ కార్లను భారత్ లోకి అనుమతించబోమని నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. భారత్ టెస్లా కార్ల అమ్మకాలను అనుమతిస్తాం కానీ, చైనాలో తయారు చేసిన కార్లను మనదేశంలో అమ్ముకోవడానికి అంగీకరించే ప్రసక్తే లేదన్నారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడానికి అధునాతన టెక్నాలజీని స్వీకరించడానికి కేంద్రం ఎల్లవేళలా సిద్ధంగా ఉందని చెప్పారు.
రోడ్డు ప్రమాదాల్లో మరణాలను తగ్గించడానికి కార్లలో ఆరు ఎయిర్ బ్యాగ్‌ల నిబంధన తెచ్చామని నితిన్ గడ్కరీ తెలిపారు. తరుచుగా ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డుల ఏర్పాటు, బ్లైండ్ స్పాట్ల తగ్గింపు, ఎలక్ట్రానిక్ మోటార్ల చట్టాన్ని బలోపేతం చేసి ప్రమాదాలకు పాల్పడే వారిపై భారీ జరిమాన విధించడం వంటి చర్యలు కేంద్రం చేపట్టిందన్నారు.