కోల్‌కతా, సెప్టెంబర్ 27: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్న ప్రతీకార సుంకాలతో భారత్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నది. దేశీయ ఫార్మా ఎగుమతులపై 100 శాతం టారిఫ్‌లను విధిస్తూ ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయంతో ఫార్మా రంగ సంస్థలు ఆందోళన చెందుతున్నాయి. ఈ ప్రతీకార సుంకాలతో దేశీయ వృద్ధిరేటు కూడా ఢీలా పడే ప్రమాదం ఉన్నదని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ అనుబంధ సంస్థయైన క్రిసిల్ ఇంటెలిజెన్స్ తన నివేదికలో వెల్లడించింది. సెప్టెంబర్ నెలకుగాను విడుదల చేసిన రిపోర్ట్‌లో ఈ విషయాన్ని స్పష్టంచేసింది. దేశీయ వినిమయం భారీగా పుంజుకున్నప్పటికీ అంతర్జాతీయ స్థాయిలో ఎగుమతులు ఢీలా పడే ప్రమాదం ఉన్నదని హెచ్చరించింది.
దేశీయ వస్తువులపై ట్రంప్ టారిఫ్ బాంబు వేయడంతో ఇప్పటికే ఢీలా పడిన పరిశ్రమ రంగాలు తాజాగా సుంకం విధించడంతో ఫార్మా రంగ సంస్థలపై తీవ్ర స్థాయిలో ప్రభావం చూపనున్నదని తన నివేదిక వెల్లడించింది. దీంతోపాటు దేశీయంగా పెట్టుబడులు పెట్టేవారు వెనుకంజ వేసే అవకాశాలు కూడా ఉన్నాయని పేర్కొంది. అయినప్పటికీ ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడం, వడ్డీరేట్ల కోతల ద్వారా దేశీయ వినిమయం పుంజుకోనుండటంతో వృద్ధికి బాటలు వేయనున్నదని అభిప్రాయపడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో భారత వృద్ధిరేటు ఐదు త్రైమాసికాల గరిష్ఠ స్థాయి 7.8 శాతంగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన 7.4 శాతం కంటే ఇది అధికం.
అలాగే ధరల సూచీ 3.5 శాతానికి తగ్గుముఖం పట్టడంతో రిజర్వు బ్యాంక్ వడ్డీరేట్లను తగ్గించడానికి వీలు పడనున్నదని, దీంతో వృద్ధి మరింత పరుగులు పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయని తన నివేదికలో వెల్లడింది. అధిక వర్షపాతం ప్రభావాన్ని ఇంకా పూర్తిగా అంచనావేయనప్పటికీ, ఆరోగ్యకరమైన వ్యవసాయ వృద్ధితో ఆహార ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచుతుందని భావిస్తున్నట్టు వెల్లడించింది. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గుముఖం పట్టడం, కమోడిటీ ఉత్పత్తులు కూడా చౌక కావడం కూడా కలిసిరానున్నదని పేర్కొంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రిజర్వుబ్యాంక్ రెండు సార్లు వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలున్నాయని తెలిపింది. అమెరికా ఫెడరల్ రిజర్వు క్రమంగా వడ్డీరేట్లను తగ్గిస్తుండటంతో ఈ ప్రభావాన్ని తట్టుకోవడానికి ఆర్బీఐ కూడా వచ్చే సమీక్షల్లో పావు శాతం చొప్పున రేట్లను రెండు సార్లు తగ్గిస్తుందని ఆశిస్తున్నట్టు వెల్లడించింది. ఆ తర్వాతి రేట్లను ముట్టుకోకపోవచ్చని తెలిపింది.