న్యూఢిల్లీ, మే 11: దేశీయ స్టార్టప్‌లు నిధుల సేకరణలో దూసుకుపోతున్నాయి. ఈవారంలో 24 దేశీయ స్టార్టప్‌లు ఏకంగా 320 మిలియన్ డాలర్ల నిధులను సమీకరించాయి. వీటిలో ఏడు ఒప్పందాలు ఇప్పటికే కుదరగా, మరో 13 ఒప్పందాలు ప్రారంభ దశలో ఉన్నాయని ఎంట్రాక్ తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. అంతక్రితం వారంలోనూ 28 స్టార్టప్‌ల్లోకి 340 మిలియన్ డాలర్ల పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చాయి. అలాగే ఈ వారంలో జరిగిన ఒప్పందాల్లో ఏడు స్టార్టప్‌ల్లోకి 287 మిలియన్ డాలర్ల ఫండింగ్ సమకూరాయి. వీటిలో డాటా, కృత్రిమ మేధస్సు గవర్నెన్స్లకు సంబంధించిన స్టార్టప్‌లు అగ్రస్థానంలో ఉన్నాయి.
సంస్థల వారీగా చూస్తే అట్లాన్ స్టార్టప్లోకి అత్యధికంగా 105 మిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. దీంతోపాటు నెఫ్రోప్లస్లోకి 105 మిలియన్ డాలర్లు రాగా, గ్రీన్‌సెల్ మొబిలిటీలోకి 36.7 మిలియన్ డాలర్లు, కే12 టెక్నో సర్వీసెస్‌లోకి 27 మిలియన్ డాలర్లు, లెండింగ్కార్ట్లోకి 10 మిలియన్ డాలర్ల మేర పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయి. అలాగే ప్రారంభ దశలో ఉన్న 13 స్టార్టప్లోకి 33 మిలియన్ డాలర్ల ఫండింగ్ జరిగింది. నగరాల వారీగా చూస్తే బెంగళూరుకు చెందిన తొమ్మిది స్టార్టప్‌ల్లోకి అత్యధిక పెట్టుబడులను ఆకర్షించగా..ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై, హైదరాబాద్, అహ్మదాబాద్, గాంధీనగర్, ఇండోర్, కోల్‌కతాకు చెందిన పలు స్టార్టప్‌లు ఉన్నాయి.
హైదరాబాద్ సిటీబ్యూరో: పెట్టుబడులు ఆకట్టుకోవడంలో టీ హబ్ స్టార్టప్‌లు దూసుకుపోతున్నాయి. తాజాగా ఈ జాబితాలోకి ఫ్యాక్టరీ ఆటోమేషన్ రోబోటిక్ టెక్నాలజీ సేవలు అందిస్తున్న పర్సెఫ్టీన్ కూడా చేరింది. ప్రారంభ దశలో ఉన్న ఈ స్టార్టప్‌కు పెట్టుబడిదారుల నుంచి ఆశించిన స్థాయిలో నిధులు సమకూరాయని టీ హబ్ నిర్వాహకులు తెలిపారు. దేశంలోనే మొదటిసారిగా ఇండస్ట్రీయల్ హ్యుమనాయిడ్ రోబోట్‌ను తయారు చేయడమే లక్ష్యంగా చేసుకొని ఈ స్టార్టప్ కార్యకలాపాలను అభివృద్ధి చేస్తున్నది.