హైదరాబాద్, నవంబర్ 15: దేశీయ నాన్-బ్యాంకింగ్ ఆర్థిక సేవల సంస్థ(ఎన్బీఎఫ్సీ) ఐసీఎల్ ఫిన్‌కార్ప్ మరోసారి నాన్-కన్వర్టబుల్ డిబెంచర్లను జారీ చేసింది. ఈ నెల 17న ప్రారంభంకానున్న ఎన్సీడీ ఇష్యూ..ఈ నెల 28న ముగియనున్నదని పేర్కొంది. రూ.1,000 విలువ కలిగిన ఇష్యూలో కొనుగోలుదారుడు కనీసంగా 10 ఎన్సీడీలు కొనుగోలు చేయాల్సివుంటుంది. 13, 24, 36,60, 70 నెలల కాలపరిమితితో ఈ ఎన్సీడీలను ఎంచుకోవచ్చును. వీటిపై కనిష్ఠంగా 10.50 శాతం వార్షిక వడ్డీని ఆఫర్ చేస్తున్న సంస్థ..గరిష్ఠంగా 12.62 శాతం వడ్డీని చెల్లించనున్నది.
ఇలా సేకరించిన రూ.100 కోట్ల నిధులను బంగారం తాకట్టుపై రుణాలు ఇవ్వడానికి వినియోగించనున్నట్టు కంపెనీ సీఎండీ కేజీ అనిల్ కుమార్ వెల్లడించారు. ప్రస్తుతం సంస్థ కేరళతోపాటు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా, గుజరాత్, బెంగాల్, గోవాల్లో కార్యకలాపాలు అందిస్తున్నట్టు, త్వరలో ఢిల్లీ, రాజస్థాన్‌కు విస్తరించనున్నట్టు ప్రకటించారు.