ముంబై, జనవరి 9: దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్ అంచనాలకుమించి రాణించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను సంస్థ రూ.12,380 కోట్ల నికర లాభం ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే సమయంలో నమోదైన రూ.11,058 కోట్ల లాభంతో పోలిస్తే 11.95 శాతం ఎగబాకింది.
సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 5.6 శాతం ఎగబాకి రూ. 60,583 కోట్ల నుంచి రూ.63,973 కోట్లకు చేరుకున్నట్లు బీఎస్ఈకి సమాచారం అందించింది. సెప్టెంబర్ త్రైమాసికంలో నమోదైన రూ.64,259 కోట్లతో పోలిస్తే భారీగా తగ్గింది. గత త్రైమాసికంలో కొత్తగా 10.2 బిలియన్ డాలర్ల విలువైన ఆర్డర్లు వచ్చాయని కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కే కృతివాసన్ తెలిపారు.