Google Chrome – US DOJ | ఇంటర్నెట్, సెర్చింజన్ సర్వీసుల్లో ఆధిపత్యం ప్రదర్శిస్తున్న గూగుల్ క్రోమ్‌పై అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ (US DOJ) కన్నెర్ర చేసిందా.. ? అంటే అవుననే సమాధానమే వస్తున్నది. గూగుల్ క్రోమ్ ఇంటర్నెట్ బ్రౌజర్‌ను అమ్మేయాలని దాని మాతృసంస్థ అల్ఫాబెట్ మీద డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఒత్తిడి తెస్తున్నదని బ్లూంబర్గ్ సోమవారం ఓ వార్త ప్రచురించింది. సెర్చింజన్ మార్కెట్‌పై చట్ట విరుద్ధంగా గూగుల్ ఏకఛత్రాధిపత్యం ప్రదర్శిస్తున్నదని ఆగస్టులో ఓ న్యాయమూర్తి రూలింగ్ కూడా ఇచ్చారు. అదే జడ్జి ముందు డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ (డీవోజే) ఈ ప్రతిపాదన పెట్టినట్లు సమాచారం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, గూగుల్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్ కు సంబంధించి చర్యలు తీసుకోవాల్సి ఉందని డీఓజే పేర్కొన్నట్లు అధికార వర్గాల కథనం.
దీనిపై అధికారికంగా స్పందించడానికి డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ నిరాకరించింది. మరోవైపు గూగుల్ రెగ్యులేటరీ అఫైర్స్ వైస్ ప్రెసిడెంట్ లీ అన్నే ముల్హోలాండ్ స్పందిస్తూ.. ‘డీవోజే రాడికల్ ఎజెండా ముందుకు తీసుకొస్తున్నది. దీని వెనుక న్యాయ సమస్యలు ఉన్నాయి. ఇది వినియోగదారులకు నష్టం చేకూరుస్తుంది’ అని వ్యాఖ్యానించారు. బడా టెక్ కంపెనీల ఏకఛత్రాధిపత్యానికి చెక్ పెట్టేందుకు బైడెన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అని చెబుతున్నారు. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ తిరిగి ఎన్నికవ్వడం కూడా దీనిపై ప్రభావం చూపుతుందని సమాచారం.
తన పట్ల వివక్ష ప్రదర్శించిన గూగుల్ ను ఒక నెల రోజుల తర్వాత విచ్ఛిన్నం చేయడం మంచి ఐడియా కదా అని అధ్యక్ష ఎన్నికలకు రెండు నెలల ముందు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. గూగుల్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ వాడుకుంటున్నందుకు ఆ సంస్థ ఆపిల్, ఇతర స్మార్ట్ ఫోన్ల తయారీ కంపెనీలకు ఏటా బిలియన్ల కొద్ది డాలర్లు చెల్లిస్తుంది. ఇందుకు ప్రతిగా గూగుల్, ఇతర స్మార్ట్ ఫోన్ సంస్థలు గూగుల్ క్రోమ్ ను డిపాల్ట్ సెర్చింజన్ గా వినియోగిస్తుంటారు. ఇక నుంచి దీనికి చెక్ పెట్టాలని ప్రాసిక్యూటర్లు ప్రణాళిక రూపొందించారు. గూగుల్ క్రోమ్ ను విక్రయించాలా..? వద్దా..? ఇతర ప్రత్యామ్నాయాలు ఆలోచించాలా అన్న విషయమై ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం.