హైదరాబాద్, జనవరి 30: ప్రముఖ పాల ఉత్పత్తుల సంస్థ దొడ్ల డెయిరీ లిమిటెడ్ అంచనాలకుమించి రాణించింది. డిసెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను రూ. 63.56 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.41.33 కోట్లతో పోలిస్తే 54 శాతం వృద్ధిని నమోదు చేసుకున్నది.
కంపెనీ ఆదాయం రూ.752.5 కోట్ల నుంచి రూ. 912.20 కోట్లకు చేరుకున్నట్లు వెల్లడించింది. వ్యాపార విస్తరణలో భాగంగా రూ.280 కోట్ల పెట్టుబడితో మహారాష్ట్రలో నూతన పాల శీతలీకరణ ప్లాంట్‌ను నెలకొల్పబోతున్నట్లు కంపెనీ ఎండీ దొడ్ల సునీల్ రెడ్డి తెలిపారు. ఈ నిధులను కంపెనీ అంతర్గత వనరుల ద్వారా సేకరిస్తున్నట్లు, అలాగే రోజుకు 17.1 లక్షల లీటర్ల పాలను రైతుల నుంచి సేకరించి ప్రాసెసింగ్ చేస్తున్నట్లు చెప్పారు.