Diwali Sales | ప్రస్తుత పండుగల సీజన్లో దీపావళి వరకూ దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో రూ.3.75 లక్షల కోట్ల విలువైన వ్యాపార లావాదేవీలు జరిగాయని వ్యాపార సంస్థల సంఘం.. కాన్ఫిడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) పేర్కొంది. గోవర్ధన్ పూజ, భాయా దూజ్, ఛాత్ పూజ, తులసీ వివాహ్ వంటి పర్వదినాల నేపథ్యంలో మరో రూ.50 వేల కోట్ల విలువైన వ్యాపారం జరిగే అవకాశం ఉందని కెయిట్ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ తెలిపారు. ప్రస్తుత దీపావళి సీజన్లో చైనా గూడ్స్ రూ.లక్ష కోట్లకు పైగా మార్కెట్ కోల్పోయాయని తెలిపారు. ఈ ఏడాది దీపావళి సందర్భంగా దేశీయ ఉత్పత్తులే అమ్ముడయ్యాయన్నారు.
‘ఇంతకుముందు దేశవ్యాప్తంగా దీపావళి సందర్భంగా దాదాపు 70 శాతం చైనా ఉత్పత్తులే అమ్ముడయ్యేవి. కానీ ప్రధాని నరేంద్రమోదీ అభ్యర్థన మేరకు వ్యాపారులు స్థానిక ఉత్పత్తులనే విక్రయించారు. వినియోగదారులు కూడా దేశీయ ఉత్పత్తులను ఆదరించారు’ అని కెయిట్ సెక్రటరీ జెనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ పేర్కొన్నారు.