టాటా గ్రూప్.. భారతీయ వ్యాపార, పారిశ్రామిక రంగాలకు ప్రతిబింబం. దేశ ఆర్థిక వ్యవస్థలో ఇంచుమించు ప్రతీ రంగంలోనూ ఈ బహుళ వాణిజ్య దిగ్గజం అడుగులు కనిపిస్తాయి. 150 ఏండ్లకుపైగా చరిత్ర.. 180 బిలియన్ డాలర్ల వ్యాపార సామ్రాజ్యం.. 30 లిస్టెడ్ సంస్థలు సహా మొత్తం 400కుపైగా కంపెనీలు.. దేశ, విదేశాల్లో కార్యకలాపాలు టాటాల సొంతం. కానీ టాటా ట్రస్టీల్లో నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు ఇప్పుడు భగ్గుమన్నాయి. బోర్డు సభ్యుల ఎంపిక అంతర్గత పోరుకు దారితీయగా.. చివరకు కేంద్ర ప్రభుత్వ పెద్దలు సైతం జోక్యం చేసుకోవాల్సి వస్తున్నది.
న్యూఢిల్లీ/ముంబై, అక్టోబర్ 8: సాల్ట్ టు సాఫ్ట్వేర్, హెయిర్ పిన్ టు ఏవియేషన్ వరకు విస్తరించిన టాటా గ్రూప్.. ప్రస్తుతం ఓ అసాధారణ సంక్షోభాన్నే ఎదుర్కొంటున్నది. గ్రూప్ మాతృ సంస్థ టాటా సన్స్‌లో ఏకంగా 66 శాతం వాటాలున్న టాటా ట్రస్ట్స్‌లో అంతర్గత కుమ్ములాటలు ముదురుతున్నాయి మరి. అయితే టాటా గ్రూప్ అభివృద్ధిలో కీలకంగా వ్యవహరించిన రతన్ టాటా చనిపోయి సరిగ్గా ఏడాది అవుతున్న సమయంలోనే ట్రస్టీల్లో విభేదాలు భగ్గుమనడం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంటున్నదిప్పుడు.
ఇదీ సంగతి..
టాటా గ్రూప్ వాటాల్లో టాటా, మిస్త్రీ కుటుంబాలదే పైచేయి. అయితే ఈ ఇరు కుటుంబాల మధ్య ఆధిపత్య పోరు ఇప్పుడు తీవ్రతరమైనట్టు కనిపిస్తున్నది. నిజానికి టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీపై వేటుతోనే విభేదాలు మొదలవగా.. గత ఏడాది అక్టోబర్‌లో రతన్ టాటా చనిపోయాక అవి మరింత పెరిగాయి. నిరుడు అక్టోబర్ 9న రతన్ మరణించగా.. ఆ తర్వాత టాటా ట్రస్ట్స్ చైర్మన్‌గా నియోల్ టాటా నియమితులయ్యారు. అప్పట్నుంచే టాటా సన్స్‌లో టాటాల తర్వాత అధిక వాటా (18.41 శాతం)లున్న షాపూర్జీ పల్లోంజీ కుటుంబానికి ప్రాతినిథ్యం వహిస్తున్న మెహ్లీ మిస్త్రీకి, నియోల్ టాటాకు మధ్య అంతర్యుద్ధం మొదలైనట్టు చెప్తున్నారు. ఈ క్రమంలోనే ఏడుగురు సభ్యులున్న టాటా ట్రస్టీలు నియోల్ టాటా, మెహ్లీ మిస్త్రీ వర్గాలుగా చీలిపోయారు.
బోర్డు నియామకాల్లో మిస్త్రీ జోక్యం ఎక్కువైపోవడం, కీలక నిర్ణయాల్లో ఒంటెత్తు పోకడ.. పరిస్థితుల్ని మరింత దిగజార్చినట్టు తెలుస్తున్నది. ఇక గత నెల 11న టాటా సన్స్‌లో ఎప్పట్నుంచో డైరెక్టర్‌గా ఉన్న విజయ్ సింగ్ (ఏడుగురు టాటా ట్రస్టీల్లో ఈయన కూడా ఒకరు)ను మళ్లీ నియమించుకోవాలన్న ప్రతిపాదనపై చర్చించేందుకు ఆరుగురు ట్రస్టీలు సమావేశమయ్యారు. ఈ ప్రతిపాదనను ట్రస్టీలైన నియోల్ టాటా, వేణు శ్రీనివాసన్ సమర్థించారు. కానీ మిస్త్రీ వర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఫలితంగా తీర్మానం తిరస్కరణకు గురవగా, విజయ్ సింగ్ స్వచ్చంధంగా రాజీనామా చేశారు. మరోవైపు టాటా సన్స్ బోర్డులోకి మిస్త్రీని నామినేట్ చేయాలని ముగ్గురు ట్రస్టీలు ప్రయత్నించగా, దాన్ని నియోల్ టాటా, వేణు శ్రీనివాసన్ మాత్రమే వ్యతిరేకించడం విభేదాలను తారాస్థాయికి తీసుకెళ్లాయి.
రంగంలోకి అమిత్ షా, నిర్మల
టాటా గ్రూప్ ప్రతిష్ఠను దెబ్బతీస్తున్న ఈ వ్యవహారంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దృష్టి సారించారు. మంగళవారం ఈ ఇరువురిని టాటా ట్రస్టీలు నియోల్ టాటా, వేణు శ్రీనివాసన్, డారియస్ ఖంబట, టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ కలిసిన విషయం తెలిసిందే. దేశ ఆర్థికాభివృద్ధికి టాటా గ్రూప్ చేస్తున్న కృషి దృష్ట్యా ఈ అంశాన్ని మంత్రులు ఒకింత సీరియస్‌గానే తీసుకున్నట్టు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే అమిత్ షా నివాసంలో 45 నిమిషాలపాటు చర్చ జరిగినట్టు సమాచారం. ఈ క్రమంలోనే గ్రూప్ సుస్థిరత దెబ్బతినకుండా తగిన చర్యలు తీసుకోవాలని టాటా నాయకత్వానికి సూచించారు. అవసరమైతే తప్పక జోక్యం చేసుకునే వీలుందని అంటున్నారు. దేశీయ అతిపెద్ద ప్రైవేట్ రంగ సంస్థల సమాహారంగా ఉన్న టాటా సన్స్‌లో విభేదాలు.. కంపెనీకేగాక, దేశ ఆర్థిక వ్యవస్థకూ నష్టమేనని కేంద్రం యోచిస్తున్నది.
స్టాక్ మార్కెట్లతోపాటు ఇతర రంగాలూ ప్రభావితం కావచ్చన్న అభిప్రాయాలుండటమే ఇందుకు కారణం. ఇదిలావుంటే టాటా సన్స్ పబ్లిక్ లిస్టింగ్‌కు ఆర్బీఐ పెట్టిన గడువు దాటిపోవడం, ఈ విషయంలో కంపెనీ వెనక్కి తగ్గడంపైనా షా, నిర్మల చర్చించినట్టు తెలుస్తున్నది. మరోవైపు ఈ నెల 10న టాటా ట్రస్టుల బోర్డు సమావేశం జరగాల్సి ఉన్నది. దీంతో ఇప్పుడు భాగస్వాములందరి చూపు దీనిపైనే ఉన్నది. ఇక దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్ జూలై-సెప్టెంబర్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలకు సంబంధించిన విలేకరుల సమావేశం రైద్దెంది. గురువారం జరగాల్సి ఉన్నది. అయితే రతన్ టాటా నిరుడు ఇదే రోజు (అక్టోబర్ 9)న చనిపోవడంతో యానివర్సరీ దృష్ట్యా ఆపేసినట్టు తెలుస్తున్నది.
వాటా అమ్మనున్న పల్లోంజీ?
టాటా సన్స్‌లో 4-6 శాతం వాటాను అమ్మేందుకు షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌నకు టాటా ట్రస్ట్స్, టాటా సన్స్ ఓపెన్ ఆఫర్ ఇచ్చాయి. పల్లోంజీ గ్రూప్‌పై దాదాపు రూ.30 వేల కోట్ల రుణ భారం ఉన్నది. ఈ వాటా అమ్మకం సంస్థకు అత్యవసరం కానుండగా, అమ్మితే టాటాల ఆధిపత్యం మరింత పెరిగిపోవడం అన్నది ఇప్పుడు ప్రాధాన్యాన్ని దక్కించుకుంటున్నది.