SBI | బ్యాంకింగ్ రంగానికి డిజిటలైజేషన్, ఇన్నోవేటివ్ టెక్నాలజీలు అసాధారణ రీతిలో అంతరాయం కలిగిస్తున్నాయి.. ఈ మాటలు అన్నది ఎవరో కాదు అతిపెద్ద ప్రభుత్వ రంగ వాణిజ్య బ్యాంక్ ఎస్బీఐ చైర్మన్ దినేశ్ ఖరా. ఖాతాదారుల్లో పెరుగుతున్న ఆకాంక్షలకు అనుగుణంగా సేవలందించేందుకు బ్యాంకులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. బ్యాంకులు డిజిటల్ విప్లవాన్ని అంది పుచ్చుకోవడంతో ఖర్చు తగ్గి, సర్వీసులు విస్తరించాయని శుక్రవారం ఓ కార్యక్రమంలో దినేశ్ ఖరా తెలిపారు.
పరిశ్రమలను డిజిటల్ ఇన్నోవేషన్ పునర్నిర్వచిస్తున్నదని, వ్యాపార లావాదేవీల మార్గాలను మార్చేస్తున్నదని దినేశ్ ఖరా అన్నారు. డిజిటైజేషన్, డిజిటల్ ఇన్నోవేషన్లకు బ్యాంకులు వ్యూహాత్మక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. శరవేగంగా మారుతున్న ఎకో సిస్టమ్‌కు అనుగుణంగా బ్యాంకింగ్ సేవల్లో డిజిటల్ పరివర్తన తేవాల్సిన వాస్తవ పరిస్థితులను బ్యాంకులు అంగీకరించాలన్నారు. అందుకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు ఒక స్పష్టమైన విజన్ ఉండాలని చెప్పారు.
ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ సునీల్ మెహతా మాట్లాడుతూ చెల్లింపుల వ్యవస్థ డిజిటలైజ్ అయ్యిందన్నారు. ఇప్పుడు రుణాల ప్రక్రియ డిజిటైజేషన్ కావాల్సి ఉందని చెప్పారు. తదుపరి దశలో రుణాల జారీ ప్రక్రియ డిజిటైజ్ అవుతుందన్నారు. ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఎఫ్‌సీ) భారత్ హెడ్ వెండీ వెర్నర్ మాట్లాడుతూ భారత్ బ్యాంకింగ్ వ్యవస్థ త్వరితగతిన డిజిటల్ ఆధారిత ఆర్థిక వ్యవస్థగా మారుతుందన్నారు.