Diesel Cars | దేశీయంగా ఆరేండ్ల క్రితం వరకు కార్ల విక్రయాల్లో డీజిల్ కార్లదే ప్రధాన వాటా. 2016-17 ఆర్థిక సంవత్సరం నాటికి 40 శాతానికి పైగా డీజిల్ కార్లే అమ్ముడయ్యేవి. కానీ గత ఆర్థిక సంవత్సరం (2022-23) ముగిసే నాటికి మొత్తం కార్ల సేల్స్‌లో డీజిల్ కార్ల వాటా 19 శాతం లోపే. డీజిల్ కార్ల వల్ల వాయు కాలుష్యం పెరిగిపోతున్నది. దీనికి తోడు డీజిల్ కార్ల ధరలు ఎక్కువ.. వాటి రీసేల్ విలువ తక్కువ కావడం కూడా క్రమంగా డీజిల్ కార్లకు గిరాకీ తగ్గడానికి ప్రధాన కారణాలుగా ఉన్నాయని ఆటోమొబైల్ ఇండస్ట్రీ నిపుణులు చెబుతున్నారు.
2016-17లో మొత్తం కార్ల విక్రయాలు 30,46,673 యూనిట్లు. వాటిల్లో డీజిల్ కార్లు 12,33,815 (40.50శాతం), పెట్రోల్ వేరియంట్ కార్లు 18,12,858 (59.50 శాతం). ఇదిలా ఉంటే 2022-23లో మొత్తం 38,90,114 కార్లు అమ్ముడయ్యాయి. వాటిల్లో 31,66,324 పెట్రోల్ కార్లు (81.39శాతం), కేవలం 7,23,790 (18.61 శాతం) డీజిల్ కార్లు. దీన్ని బట్టి డీజిల్ కార్లకు గిరాకీ ఎలా తగ్గిపోయిందో అవగతం అవుతున్నది.
దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇక ఎంత మాత్రం డీజిల్ కార్లు విక్రయించబోనని తేల్చి చెప్పేసింది. హోండా కార్స్, స్కోడా ఆటో, రెనాల్ట్, నిస్సాన్ సంస్థలు డీజిల్ కార్లు ఆఫర్ చేయడం లేదు. హ్యుండాయ్ మోటార్ ఇండియాతోపాటు టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, కియా ఇండియా, ఎంజీ మోటార్, టయోటా కిర్లోస్కర్ మోటార్ సంస్థలు డీజిల్ కార్లు విక్రయిస్తున్నాయి.దేశంలోనే టాప్ లగ్జరీ కార్ల తయారీ సంస్థలు మెర్సిడెజ్ -బెంజ్, బీఎండబ్ల్యూలు డీజిల్ కార్లు విక్రయిస్తున్నాయి. మరోవైపు ఆడి, వోల్వో కాలర్ల తయారీ సంస్థలు డీజిల్ కార్ల విక్రయం నిలిపేశాయి.
దాదాపు దశాబ్ది కాలం క్రితం మొత్తం దేశీయ కార్ల సేల్స్ లో డీజిల్ కార్ల వాటా దాదాపు 58 శాతం. నాడు పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్ మీద రూ.32-33 తేడా ఉండేది. డీజిల్ కార్లతో మైలేజీ బెటర్ గా ఉండేది.. నిర్వహణ ఖర్చు తక్కువ. పెట్రోల్ కార్ల కంటే రూ.లక్ష ఎక్కువ. అయినా, కిలోమీటర్ల వారీగా రన్నింగ్ కాస్ట్ తగ్గడంతో తొలి రెండేండ్లలో కార్ల రుణ చెల్లింపుల్లో అదనపు చెల్లింపులతో సర్దుబాటు చేసుకునే వారు.
కానీ, డీజిల్, పెట్రోల్ ధరలపై నియంత్రణ ఎత్తేసిన తర్వాత వాటి మధ్య కేవలం రూ.5.50 మాత్రమే తేడా ఉండేది. కొన్ని రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరల మధ్య వ్యత్యాసం రూ.2 లోపే. దీనికి తోడు పెట్రోల్ వేరియంట్ కార్ల ఫ్యుయల్ ఎఫిషియెన్సీ కూడా మెరుగైంది. పలితంగా డీజిల్, పెట్రోల్ వేరియంట్ కార్ల నిర్వహణ ఖర్చు దాదాపు సమానం అని మారుతి సుజుకి మార్కెటింగ్ అండ్ సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాత్సవ తెలిపారు.
ఇటీవలే డీజిల్ తో నడిచే ఫోర్ వీలర్ వెహికల్స్ 2027 కల్లా పూర్తిగా నిషేధించాలని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సిఫారసు చేసింది. ఈ నేపథ్యంలో మున్ముందు డీజిల్ కార్లు మరింత తగ్గుతాయని శశాంక్ శ్రీవాత్సవ తెలిపారు.
హ్యాచ్ బ్యాక్ కార్లలో డీజిల్ వేరియంట్లు లేవు. సెడాన్ సెగ్మెంట్లో 2-3 శాతం మాత్రమే. ఎస్ యూవీ విభాగంలో మిడ్ సైజ్ ఎస్‌యూవీల్లో డీజిల్ కార్లు దాదాపు 50 శాతం, ఎంట్రీ లెవల్ ఎస్ యూవీలు 18 శాతం. కానీ, రెండేండ్ల క్రితం ఎంట్రీ లెవల్ డీజిల్ ఎస్ యూవీ కార్లు 82 శాతం ఉండేవి.