హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): ట్రాన్స్‌కో పరిధిలోని 400 కేవీ, 220 కేవీ, 132 కేవీ సబ్ స్టేషన్లతోపాటు వేల కిలోమీటర్ల ఈహెచ్‌టీ లైన్లను, ట్రాన్స్ఫార్మర్లను కంటికి రెప్పలా కాపాడుకొంటూ విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందికి సాంకేతిక సమస్యల పరిష్కారం కోసం ఆ సంస్థ వినూత్న ప్రయోగం చేసింది. దేశంలోనే తొలిసారిగా సంపూర్ణ సమాచారంతో ఇంగ్లిష్‌లో హ్యాండ్‌బుక్‌ను అందుబాటులోకి తెచ్చింది. దానిని తెలుగులోకి తర్జుమా చేయించింది. సాధారణంగా సబ్స్టేషన్లలో పరిమిత సమాచారంతో ఇంగ్లిష్‌లో హ్యాండ్‌బుక్ ఉంటుంది. దాని ద్వారా చాలా సమస్యలకు పరిష్కారం దొరకదు. అందుకే 720 పేజీలతో తెలుగులో హ్యాండ్‌బుక్‌ను అందుబాటులోకి తెచ్చింది.
వినూత్న ఆలోచన
కొత్తగూడెం జనరేషన్ స్టేషన్ నుంచి రిలీవ్ అయిన 198 మంది ఆర్టిజన్లు ట్రాన్స్‌కోలో చేరారు. జనరేషన్ ప్లాంట్‌లోని సాంకేతికతకు, ట్రాన్స్‌కోలో ఉండే సాంకేతికతకు తేడా ఉంటుంది. విధులు కూడా విభిన్నంగా ఉంటా యి. ఈ 198 మందికి ఎలాంటి శిక్షణ ఇవ్వాలి? ఎలాంటి సిలబస్ అవసరం? వారిలో నెలకొన్న సందేహాలు, ఎదురయ్యే సమస్యలు.. వాటికి పరిష్కారాల కోసమే ట్రాన్స్‌కో ఈ హ్యాండ్‌బుక్ ఆలోచనకు శ్రీకారం చుట్టింది. ఈ విషయాన్ని ట్రాన్స్‌కో డైరెక్టర్ జగత్‌రెడ్డి.. సీఎండీ డీ ప్రభాకర్‌రావుకు వివరించడంతో హ్యాండ్‌బుక్ తయారీకి పచ్చజెండా ఊపారు. ఈ 198 మంది ఆర్టిజన్లకు 14 రోజులపాటు కఠిన శిక్షణ ఇచ్చిన సమయంలో ఎదురైన ప్రతి సమస్యను, పరిష్కారాన్ని ఇందులో పొందుపర్చారు.
45 రోజుల్లో తెలుగులోకి తర్జుమా
ట్రాన్స్‌కోలోని ఆర్టిజన్ నుంచి మొదలుకుని జేఎల్ఎం, ఏఈ, సబ్ ఇంజినీరు.. ఇలా ప్రతి ఉద్యోగికి ఉపయోగపడేలా రూపొందించిన ఈ హ్యాండ్‌బుక్‌ను తెలుగులో తర్జుమా చేయడానికి సుమారు 45 రోజల సమయం పట్టింది. దీనిని అన్ని సబ్ స్టేషన్లకు పంపిస్తున్నారు. హ్యాండ్‌బుక్ ఆధారంగా ఇప్పటికే 3 వేల మందికి శిక్షణ ఇచ్చారు. ట్రాన్స్‌కో ఇంజినీర్లకు కూడా హ్యాండ్ ఈ బుక్ ఆధారంగానే శిక్షణ ఇస్తున్నారంటే దీన్ని ఏ స్థాయిలో తీర్చిదిద్దారో అర్థం చేసుకోవచ్చు.
తెలంగాణ ట్రాన్స్‌కో పరిధిలోని సబ్స్టేషన్ల వివరాలు
400 కేవీ సబ్ స్టేషన్లు – 23
220 కేవీ సబ్ స్టేషన్లు – 98
132 కేవీ సబ్ స్టేషన్లు – 247
విద్యుత్తు లైన్లు (కి.మీ.) – 27,375