హైదరాబాద్, సెప్టెంబర్ 13: హైదరాబాద్‌లో అతిపెద్ద మాల్స్‌కు ఎనలేని డిమాండ్ నెలకొన్నది. ప్రస్తుతేడాది తొలి ఆరు నెలల్లో భాగ్యనగరంలో 72 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణ స్థలాన్ని లీజుకు తీసుకొని షాపింగ్ మాల్స్ ఏర్పాటైనట్లు అంతర్జాతీయ ప్రాపర్టీ కన్సల్టెంట్ నైట్‌ఫ్రాంక్ ఇండియా తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. ‘థింక్ ఇండియా-థింక్ రిటైల్ 2022’ పేరుతో విడుదల చేసిన నివేదికలో 5 లక్షల చదరపు అడుగులకు పైగా విస్తీర్ణం కలిగిన షాపింగ్ మాల్స్ నివేదికలో 52 శాతం వృద్ధి నమోదైనట్లు పేర్కొంది. దేశవ్యాప్తంగా ఎనిమిది నగరాల్లో 217 మాల్స్ అందుబాటులోకి వచ్చాయని, వీటిలో 5 లక్షలకు పైగా చదరపు అడుగులు కలిగిన వాటిలో 39 శాతం పెరుగగా, 1-5 లక్షల లోపు చదరపు అడుగుల్లో 31 శాతం, లక్ష చదరపు అడుగుల తక్కువ కలిగిన లీజు 30 శాతం పెరిగినట్లు తెలిపింది. గ్రేడ్ ఏ మాల్ స్టాక్ల్లో భాగ్యనగరం తొలిస్థానంలో నిలిచింది. దేశంలో ఇతర నగరాల విషయానికి వస్తే టాప్ 8 నగరాల్లో మొత్తంగా 9.29 కోట్ల చదరపు అడుగుల స్థలం లీజుకు తీసుకున్నారు. వీటిలో ఏ గ్రేడ్ 39 శాతం అధికమవగా, గ్రేడ్ బీ 31 శాతం, గ్రేడ్ సీ 30 శాతం చొప్పున పెరిగినట్లు నివేదిక వెల్లడించింది. మరోవైపు, గడిచిన రెండున్నరేండ్లలో దేశవ్యాప్తంగా 16 నూతన షాపింగ్ మాల్స్ అందుబాటులోకి వచ్చాయి.
దేశీయ రిటైల్ రియల్ ఎస్టేట్ రంగం శరవేగంగా వృద్ధిని సాధిస్తున్నది. మధ్య, చిన్న స్థాయి మాల్స్ కంటే గ్రేడ్ ఏ మాల్స్‌కు అత్యధిక డిమాండ్ ఉన్నది.
– శిరీష్ బైజల్, నైట్ ఫ్రాంక్ ఇండియా సీఎండీ