కొండాపూర్, జనవరి 16 : గట్ – మైక్రోబయోమ్ చికిత్సలో సరికొత్త శకానికి నాంది పలుకుతు గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ దవాఖానాలో గురువారం ‘సెంటర్ ఫర్ మైక్రోబయోమ్ రిసెర్చ్ ఇండియా’ను గట్ జర్నల్ ఎడిటర్ ప్రొఫెసర్ ఏమోద్ ఎల్ ఓమర్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నేటి కాలంలో మైక్రోబయోమ్ అత్యంత కీలకమైందని, ఆరోగ్యవంతమైన జీవక్రియకు సహాయపడటంతో పాటు రోగ నిరోధక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నదన్నారు.
శరీరంలో పేరుకుపోయిన విషపదార్ధాలను తొలగించడంలో మైక్రోబయోమ్ కీలకంగా వ్యవహరిస్తుందన్నారు. అనంతరం ఏఐజీ దవాఖానన ఛైర్మన్ డాక్టర్ నాగేశ్వర్రెడ్డి మాట్లాడుతూ.. దీర్ఘకాలిక జీర్ణకోశ వ్యాధుల కోసం గట్ మైక్రోబయోమ్ ఆధారిత పరిశోధనలు, చికిత్సలను మెరుగుపరిచేందుకు ఈ కేంద్రాన్ని అంకితం చేస్తున్నట్లు తెలిపారు. ఎంతో కాలంగా జీర్ణకోశ వ్యాధుల లక్షణాల నియంత్రణ ద్వారా చికిత్స అందిస్తున్నామని, ఈ కేంద్రం ద్వారా వ్యాధికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోగలుగుతామన్నారు. మెరుగైన వైద్య సేవలందించడంలో ల్యాబ్ ఎంతో కీలకంగా మారనున్నట్లు ఆయన తెలిపారు.