Crypto Market Cap | క్రిప్టో కరెన్సీల మార్కెట్లో సోమవారం బుల్ రన్ కొనసాగింది. దాదాపు నెల రోజుల తర్వాత క్రిప్టో కరెన్సీల మార్కెట్ క్యాపిటలైజేషన్ లక్ష కోట్ల డాలర్లను తాకింది. సోమవారం మధ్యాహ్నం 3.30 గంటలకు క్రిప్టో మార్కెట్ క్యాపిటలైజేషన్ 1.02 లక్షల కోట్ల డాలర్లకు చేరుకున్నది. ఇంతకుముందు ట్రేడింగ్‌తో పోలిస్తే సోమవారం క్రిప్టోలు 4.7 శాతం లాభపడ్డాయని కాయిన్‌మార్కెట్ క్యాప్ పేర్కొంది.
క్రిప్టో మేజర్ బిట్ కాయిన్ విలువ 22 వేల డాలర్ల మార్క్‌ను తిరిగి సాధించింది. గత ముగింపుతో పోలిస్తే నాలుగు శాతానికి పైగా లబ్ధితో 22,241.17 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది. గత నెల 15న 22 వేల డాలర్ల దిగువకు పడిపోయింది. ఆ తర్వాత తిరిగి బిట్‌కాయిన్ పుంజుకోవడం ఇదే తొలిసారి.
బిట్ కాయిన్ తర్వాతీ స్థానంలో ఉన్న ఎథీరియం 9 శాతానికి పైగా లాభపడింది. 1,482.69 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది. గత నెల 13 తర్వాత 1400 డాలర్ల పై చిలుకు వద్ద ఎథీరియం ట్రేడింగ్ కావడం ఇదే ప్రథమం. మూడో స్థానంలో ఉన్న టెథర్ 0.99 డాలర్ల వద్ద ట్రేడయింది.
మార్కెట్ డేటా ప్రకారం మొత్తం క్రిప్టో కరెన్సీల మార్కెట్ క్యాపిటలైజేషన్లో బిట్ కాయిన్ వాటా 41.79 శాతం, ఎథీరియం 17.73 శాతం, టెథర్ 6.48 శాతం. సోమవారం క్రిప్టో మార్కెట్ ట్రేడింగ్‌లో 76.9 బిలియన్ల డాలర్ల విలువైన లావాదేవీలు జరిగాయి. గతవారం క్రిప్టో కరెన్సీల్లో మంచి గ్రోత్ కనిపించింది. బిట్ కాయిన్ 8 శాతానికి పైగా లాభ పడితే, ఎథీరియం సుమారు 30 శాతం బెనిఫిట్ పొందింది. ఇంకా బీఆర్బీ, ఎక్స్ఆర్పీ, సొలానా ఇతర వర్చువల్ టోకెన్లు డబుల్ డిజిట్ గ్రోత్ సాధించాయి. సొలానా 18 శాతం లాభ పడింది. ప్రపంచ వ్యాప్తంగా క్రిప్టో ఎక్స్చేంజ్ల్లో 20,255 క్రిప్టో కరెన్సీలు ట్రేడవుతున్నాయి.