క్రెడిట్ కార్డుల వినియోగదారులు ఏటేటా పెరుగుతూపోతున్నారు. దీంతో వీరిని ఆకట్టుకునేందుకు అనేక బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు, స్మాల్‌ఫైనాన్స్ కంపెనీలు పోటీ పడుతున్నాయి. మార్కెట్లో లభిస్తున్న టాప్ క్రెడిట్ కార్డులను ఒక్కసారి పరిశీలిస్తే..
క్యాష్‌బ్యాక్ క్రెడిట్ కార్డులు
ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బీఐతోపాటు ప్రధాన ప్రైవేట్ రంగ, విదేశీ బ్యాంకులు అందించే క్రెడిట్ కార్డులపై ఆకర్షణీయ క్యాష్‌బ్యాక్ ఆఫర్లు ఉంటున్నాయి. ఈ క్రెడిట్ కార్డుల వినియోగదారులు ఆన్లైన్ షాపింగ్‌పై, ఇంధన కొనుగోళ్లపై 5 శాతం వరకు క్యాష్‌బ్యాక్, అంతకుమించి క్యాష్ పాయింట్లను పొందవచ్చు.
ఈ-కామర్స్ క్రెడిట్ కార్డులు
ఈ-కామర్స్ లావాదేవీల కోసం కూడా వివిధ బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు రకరకాల క్రెడిట్ కార్డులను ఇస్తున్నాయి. వీటి వినియోగదారులు క్యాష్‌బ్యాక్‌తోపాటు, లాంజ్ యాక్సెస్, వార్షిక చార్జీలపై తగ్గింపు ప్రయోజనాలను అందుకోవచ్చు. అమెజాన్, బుక్‌మైషో వంటి సంస్థల నుంచి వోచర్లు తీసుకోవచ్చు.
ఎంటర్టైన్మెంట్ క్రెడిట్ కార్డులు
క్రెడిట్ కార్డుల వినియోగదారుల వినోదం కోసం ఉద్దేశించబడినవే ఈ కార్డులు. ఆయా బ్యాంకులు ప్రముఖ మల్టీప్లెక్స్‌ల్లో తమ కస్టమర్లకు ఉచిత టికెట్లు వచ్చేలా ఆఫర్లు ఇస్తున్నాయి. గిఫ్ట్ వోచర్లు, రివార్డు పాయింట్లనూ అందిస్తున్నాయి.
ఫ్యూయల్ క్రెడిట్ కార్డులు
ఇంధన కొనుగోళ్లపై ఈ ఫ్యూయల్ క్రెడిట్ కార్డు వినియోగదారులు లాభం పొందవచ్చు. వార్షిక వినియోగంపై రూ.5,000 వరకు ఆదా అయ్యేలా రకరకాల ప్లాన్లను అందుబాటులో ఉంచుతున్నాయి. పర్యాటకులకు ఇవి ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి.
ట్రావెల్ క్రెడిట్ కార్డులు
పర్యాటకులకు విమానాల్లో, ఏసీ రైళ్లలో వివిధ సౌకర్యాలను ఇవి అందిస్తాయి. ఈ క్రెడిట్ కార్డులను వాడేవారికి విదేశాల్లో చేసే ఖర్చులపై ప్రత్యేక రివార్డు పాయింట్లు అందుతాయి. విమానాశ్రయాల్లో లాంజ్ యాక్సెస్ కూడా ఉంటుంది.
ఫైన్ డైన్-ఇన్ క్రెడిట్ కార్డులు
హోటళ్లకు వెళ్లినప్పుడు ఈ ఫైన్ డైన్-ఇన్ క్రెడిట్ కార్డులు సౌకర్యవంతంగా, లాభదాయకంగా ఉంటాయి. అలాగే స్విగ్గీ తదితర ఫుడ్ ఆర్డర్ యాప్‌లలో ఆర్డర్లపై క్యాష్‌బ్యాక్‌తోపాటు వివిధ ఖర్చులపై రివార్డులు, బోనస్‌లను అందుకోవచ్చు.
క్లబ్ మెంబర్షిప్ క్రెడిట్ కార్డులు
ఆయా బ్యాంకులు తమ వినియోగదారులకు క్లబ్ మెంబర్షిప్ క్రెడిట్ కార్డులను అందిస్తున్నాయి. విలాసవంతమైన క్లబ్బుల్లో ఏడాదిపాటు ప్రోత్సాహక సభ్యత్వాలనూ కల్పిస్తున్నాయి.
లాంజ్ యాక్సెస్ క్రెడిట్ కార్డులు
ఎయిర్‌పోర్టులు, రైల్వే స్టేషన్లలో ఈ క్రెడిట్ కార్డులున్నవారికి లాంజ్ యాక్సెస్లుంటాయి. రివార్డు పాయింట్లు, క్యాష్‌బ్యాక్‌లు, గిఫ్ట్ వోచర్లూ అదనంగా లభిస్తాయి. ప్రయాణికులకు లాభసాటి.
చివరగా..
క్రెడిట్ కార్డులను పరిమితంగా, తెలివిగా వాడుకుంటే ఎన్ని ప్రయోజనాలో.. అదుపు తప్పితే అన్ని నష్టాలు. ముఖ్యంగా మీ క్రెడిట్ స్కోర్‌ను చాలా ప్రభావితం చేస్తాయివి. కాబట్టి అనవసరంగా క్రెడిట్ కార్డులను వాడుతూ అప్పుల ఊబిలో కూరుకుపోవద్దు. అలాగే క్రెడిట్ కార్డుకున్న పరిమితిలో 70 శాతాన్ని మించి వినియోగించకపోవడమే శ్రేయస్కరం. సమయానుసారంగా బిల్లులు చెల్లించడం మరువద్దు.