న్యూఢిల్లీ, నవంబర్ 15: డీమానిటైజేషన్ (పెద్ద నోట్ల రద్దు) జరిగి ఐదేండ్లు దాటిన తర్వాత కూడా దేశ ఆర్థిక వ్యవస్థలో నగదు చెలామణీ ప్రతీ ఏడాదీ పెరుగుతూ వస్తున్నది. పలు నగదు లావాదేవీలు డిజిటల్ రూపంలో జరుగుతున్నా, సర్క్యులేషన్ల ఉన్న కరెన్సీ నోట్లు ఎక్కువవుతూనే ఉన్నాయి. ఎస్బీఐ రీసెర్చ్ తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం ప్రస్తుత 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఇప్పుటివరకూ చెలామణీలో ఉన్న నగదు (సీఐసీ)… స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 13.1 శాతానికి చేరింది. 2016లో పెద్ద నోట్ల రద్దు తర్వాత 8.7 శాతానికి పడిపోయిన నగదు చెలామణీ..తదుపరి ఏండ్లలో క్రమేపీ అధికమయ్యింది. దేశ ఆర్థిక వ్యవస్థ అధిక వృద్ధి సాధించిన 2008-2010 ఆర్థిక సంవత్సరాల్లో సీఐసీ శాతం రెండంకెల్లోకి చేరింది. దాదాపుగా 2015 వరకూ ఇదే ట్రెండ్ కొనసాగిందని ఎస్బీఐ రీసెర్చ్ రిపోర్ట్‌ను రూపొందించిన గ్రూప్ చీఫ్ ఎకనామిక్ అడ్వయిజర్ సౌమ్య కాంతి ఘోష్ చెప్పారు. వివరాలివి…
2008-10 ఆర్థిక సంవత్సరాల్లో జీడీపీలో నగదు చెలామణీ 12.1, 12.5, 12.4 శాతంగా ఉంది.
2011-2015 మధ్యకాలంలో 12.4 శాతం గరిష్ఠంకాగా, 11.4 శాతం కనిష్ఠం.
2016లో 8.7 శాతానికి తగ్గుదల
2021 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో కొవిడ్ సంక్షోభ నేపథ్యంలో 14.5 శాతం రికార్డుస్థాయికి పెరిగిన నగదు చెలామణీ. జీడీపీ పతనంకావడంతో చెలామణీ శాతం పెరిగింది. జీడీపీ వృద్ధి సాధారణస్థాయిలో ఉంటే ఆ ఏడాది నగదు చెలామణి 12.7 శాతం ఉండేదని అంచనా. 2021లో కరోనా భయాలతో ముందు జాగ్రత్తగా ప్రజలు రూ.3.3 లక్షల కోట్ల నగదును వారివద్ద అట్టిపెట్టుకున్నారు.
రిజర్వ్‌బ్యాంక్ గణాంకాల ప్రకారం 2021 అక్టోబర్ 29నాటికి దేశంలో చెలామణీలో ఉన్న కరెన్సీ నోట్ల విలువ రూ. 29.17 లక్షల కోట్లు.
రికార్డుస్థాయికి క్రెడిట్ కార్డ్ కొనుగోళ్లు
ప్రస్తుత ఏడాది ఇప్పటివరకూ క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోళ్లు రూ. 13,300 కోట్లకు చేరినట్లు ఎస్బీఐ రిపోర్ట్ వెల్లడించింది. 2020 పూర్తి సంవత్సరంలో క్రెడిట్ కార్డుల వాడకంతో రూ.13,500 కోట్లు వ్యయంచేయగా, ఈ ఏడాది మొత్తంలో అంతకు మించనున్నట్లు ఎస్బీఐ అంచనావేసింది. 2012లో క్రెడిట్ కార్డ్‌లతో చేసే ఖర్చు రూ. 1,500 కోట్లుకాగా, 2018లో ఈ మొత్తం రూ.10,100 కోట్లకు చేరింది. ఆ తర్వాత రెండు సంవత్సరాల్లో రూ. 13,000 కోట్లను మించింది.
తగ్గుతున్న డెబిట్ కార్డ్ కొనుగోళ్లు
డెబిట్ కార్డ్ ద్వారా జరిపే కొనుగోళ్లు క్రమేపీ తగ్గుతున్నట్లు నివేదిక పేర్కొంది. 2019 సంవత్సరంలో రూ.56,300 కోట్ల రికార్డుస్థాయికి చేరిన డెబిట్ కార్డ్ కొనుగోళ్లు 2020లో రూ.13,800 కోట్లకు తగ్గగా, ప్రస్తుత ఏడాది ఇప్పటివరకూ రూ. 9,700 కోట్ల కొనుగోలు లావాదేవీలు నమోదయ్యాయి.
రూ.6.3 లక్షల కోట్ల డిజిటల్ లావాదేవీలు
ఈ ఏడాది అక్టోబర్ నెలలో రూ.6.3 లక్షల కోట్ల విలువైన 350 కోట్ల లావాదేవీలు జరిగాయని ఎస్బీఐ రీసెర్చ్ తెలిపింది. గతేడాది ఇదేనెలతో పోలిస్తే లావాదేవీల సంఖ్య 100 శాతం పెరగ్గా, లావాదేవీల విలువ 103 శాతం అధికమయ్యింది. అలాగే యూపీఐ లావాదేవీలు జోరుగా జరుగుతున్నాయి. 2017 సంవత్సరం నుంచి చూస్తే యూపీఐ లావాదేవీలు 69 రెట్లు పెరిగాయి. ప్రజలు యూపీఐ వైపు మళ్లడంతో డెబిట్‌కార్డ్ లావాదేవీల్లో పెరుగుదల లేదు.