ఖాతా ముగింపు కోసం రిజర్వ్ బ్యాంకు కొత్త నిబంధనలు
జాప్యం జరిగితే కస్టమర్‌కు రోజుకు రూ.500 పరిహార లాభం
క్రెడిట్, డెబిట్ కార్డులకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ కొత్త నిబంధనలు జారీ చేసింది. జూలై 1 నుంచి అమల్లోకి వచ్చే ఈ నిబంధనల్లో ముఖ్యమైంది క్రెడిట్ కార్డుల ముగింపునకు సంబంధించినదే. వారం రోజుల్లో పని పూర్తికాకపోతే కస్టమర్‌కు రోజుకు రూ.500 చొప్పున జరిమానా కింద కార్డు జారీదారులు ఇవ్వాల్సి ఉంటుంది మరి. ‘క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు-జారీ, నిర్వహణ మార్గదర్శకాలు 2022’ పేరుతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కొత్త నిబంధనల్ని ప్రకటించింది. ఈ ఏడాది జూలై మొదలు ఇవి అమల్లోకి రానున్నాయి. పేమెంట్స్ బ్యాంకులు, రాష్ట్ర సహకార బ్యాంకులు, జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు మినహా దేశంలోని అన్ని షెడ్యూల్డ్ బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ)లకు ఈ నిబంధనలు వర్తిస్తాయి.
అయితే క్రెడిట్ కార్డు అకౌంట్ క్లోజింగ్‌లో ఏర్పడుతున్న జాప్యాన్ని తీవ్రంగా పరిగణించిన ఆర్బీఐ.. కార్డు జారీదారులకు పెద్ద షాకే ఇచ్చింది. కస్టమర్లు తమ క్రెడిట్ కార్డును క్లోజ్ చేయాలని కోరిన వెంటనే.. వారికి అందుకు సంబంధించి ఈ-మెయిల్, ఎస్ఎంఎస్ల ద్వారా ఆయా బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు తెలియజేయాల్సి ఉంటుంది. అలాగే క్రెడిట్ కార్డు ఖాతా ముగింపు కోసం కస్టమర్‌కు హెల్ప్‌లైన్, ప్రత్యేక ఈ-మెయిల్ ఐడీ, ఇంటరాక్టివ్ వాయిస్ రెస్సాన్స్, వెబ్సైట్లో సులభంగా కనిపించేలా ప్రత్యేక లింక్, మొబైల్ యాప్ తదితర సదుపాయాలనూ కల్పించాలని కొత్త నిబంధనల్లో ఆర్బీఐ పేర్కొన్నది. ఇక వారం రోజుల్లో కనుక క్లోజర్ రిక్వెస్ట్‌ను ప్రాసెస్ చేయలేకపోతే రోజుకు రూ.500 చొప్పున జరిమానాను కార్డును క్లోజ్ చేసేంత వరకు వినియోగదారునికి సదరు కార్డును జారీ చేసిన సంస్థలు చెల్లించాల్సి వస్తుంది. అయితే కార్డుదారుడు అప్పటికే అన్ని బకాయిలను చెల్లించి ఉండాలి.
ఇక చాలా దేశాల్లో ఫారెక్స్ ట్రేడింగ్ మర్చంట్స్, కాసినోలు, హోటల్స్, వెబ్సైట్లు ప్రకటనల్ని గుప్పిస్తుంటాయి. చెల్లింపులు క్రెడిట్ లేదా డెబిట్ కార్డు ద్వారా జరపాలని కోరుతుంటారు. ఇలాంటి వాటికి కార్డులను ఉపయోగించే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. ఫెమా కరెంట్ అకౌంట్ నిబంధనలు విదేశీ లావాదేవీలకే వర్తిస్తాయి కాబట్టి విదేశీ ప్రయాణాల్లో కార్డులను ఉపయోగించడంలో జాగ్రత్త అవసరం.
కార్డు రద్దు ఇలా..
వినియోగదారుడు ఏడాదిపాటు తన క్రెడిట్ కార్డును వాడకపోతే ఆ కార్డును జారీచేసిన సంస్థలు దాన్ని రద్దు చేయవచ్చు. అయితే కార్డును రద్దు చేస్తున్నట్టు వినియోగదారునికి తెలిపిన నెల రోజుల తర్వాత కూడా స్పందన లేకపోతేనే రద్దు చేయాలి. ఇక కార్డు రద్దు సమాచారాన్ని 30 రోజులలోపు క్రెడిట్ బ్యూరో (సిబిల్)కూ తెలియజేయాలి. కాగా, క్రెడిట్ కార్డు అకౌంట్ క్లోజ్ చేసిన తర్వాత కూడా వినియోగదారునికి క్రెడిట్ ఉంటే దాన్ని బ్యాంకుకు బదిలీ చేయాలి. ఒకవేళ కార్డుదారుని బ్యాంకు ఖాతా వివరాలు లేకపోతే కార్డు జారీచేసిన సంస్థ తన వద్దనే ఉంచుకోవచ్చు.
ఈ లావాదేవీలు కుదరవు
మీ క్రెడిట్ లేదా డెబిట్ కార్డులకు అంతర్జాతీయ లావాదేవీల అనుమతులున్నాసరే ఫెమా చట్టంలో తీసుకొచ్చిన మార్పులతో కొన్నిరకాల లావాదేవీలు చేయలేరు. ఫెమా కరెంట్ అకౌంట్ నిబంధనల్లో మార్పు కారణంగా రిజర్వ్ బ్యాంక్ ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చింది మరి. దీని ప్రకారం ఇకపై అంతర్జాతీయ లాటరీ టికెట్లు, నిషేధించిన పత్రికల సబ్స్క్రిప్షన్, స్వీప్ టేక్లలో పాల్గొనడం, కాల్‌బ్యాక్ సేవలకు చెల్లింపులు చేయడం కుదరదు. ఇటీవలే ఎస్బీఐ తమ క్రెడిట్ కార్డు వినియోగదారులకు పంపిన ఈ-మెయిల్లో ఫారెక్స్ ట్రేడింగ్, బెట్టింగ్, గ్యాంబ్లింగ్లను నిషేధించినట్టు స్పష్టం చేసింది. ఒకవేళ నిషేధించిన లావాదేవీలను వినియోగదారులు చేస్తే ఆర్బీఐ నిబంధనల ప్రకారం కార్డుదారున్ని బాధ్యునిగా చేసి చర్యలు తీసుకుంటారు. కార్డును రద్దు చేస్తారు. కొన్ని సందర్భాల్లో లావాదేవీలు జరిపిన మొత్తాలకు మూడు రెట్ల జరిమానా కూడా ఉండవచ్చు.