హైదరాబాద్, జనవరి 20: ప్రముఖ టెక్నాలజీ సేవల సంస్థ కంట్రోల్ఎస్..హైదరాబాద్‌లో 40 ఎకరాల స్థలంలో నూతన డాటాసెంటర్ పార్క్‌ను నెలకొల్పబోతున్నట్లు ప్రకటించింది. నగరానికి సమీపంలోని చంద్రవెల్లి ఇండస్ట్రీయల్ పార్క్ సమీపంలో ఏర్పాటు చేస్తున్న ఈ డాటా సెంటర్ పార్క్ సామర్థ్యం 600 మెగావాట్లు. ప్రస్తుతం సంస్థ 52 మెగావాట్ల కెపాసిటీ సామర్థ్యం కలిగివున్నది. ఈ పార్క్ అందుబాటులోకి వస్తే మొత్తం సామర్థ్యం 600 మెగావాట్లకు పైకి చేరుకోనున్నది. ఈ సందర్భంగా కంట్రోల్ఎస్ డాటాసెంటర్స్ లిమిటెడ్ చైర్మన్ శ్రీధర్ పిన్నపురెడ్డి మాట్లాడుతూ..భారత్‌లో అత్యధిక వృద్ధిని నమోదు చేసుకుంటున్న రాష్ర్టాల్లో తెలంగాణ ముందు వరుసలో ఉన్నదని, వ్యాపార విస్తరణలో భాగంగా ఇక్కడ డాటాసెంటర్ పార్క్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. ప్రస్తుతం సంస్థకు హైదరాబాద్‌లో మూడు డాటాసెంటర్లతోపాటు ముంబై, చెన్నై, బెంగళూరు, నోయిడా, కోల్‌కతాలో కూడా సెంటర్లు ఉన్నాయి. భారత్‌లో 1,300 మెగావాట్ల సామర్థ్యం కలిగిన డాటా సెంటర్లు ఉండగా, 2026 నాటికి ఇది 1,800 మెగావాట్లకు చేరుకోనున్నదని సర్వేలు అంచనావేస్తున్నాయి. భారత్‌లో డిజిటల్ ట్రాన్స్పర్మేషన్, ఏఐ, క్లౌడ్, ప్రాంతీయంగా డాటా సేవలకు డిమాండ్ అధికంగా ఉండటం ఇందుకు కారణమని తెలిపింది.