Tesla to Entry India | భారతీయ రోడ్లపై టెస్లా ఎలక్ట్రిక్ కార్లు పరుగులు తీయనున్నాయా.. అవును.. దేశీయ విపణిలోకి అడుగు పెట్టేందుకు టెస్లా ఎలక్ట్రిక్ కార్లకు అనుమతి లభించింది. దేశీయంగా తయారు చేసి విక్రయించడానికి/ నేరుగా దిగుమతి చేసుకుని విక్రయించడానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకోసం సర్టిఫికెట్ జారీ చేసినట్లు సమాచారం. నాలుగు మోడల్ కార్ల విక్రయానికి అంగీకరించినట్లు కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వశాఖ వెబ్సైట్ పేర్కొంటున్నది.
దీని ధర ఎక్కువగా ఉండటంతోపాటు భారత్‌లో ఎలక్ట్రిక్ కార్లకు చార్జింగ్ ఫెసిలిటీస్ చాలా తక్కువ.. ప్రతిఏటా మొత్తం కార్ల సేల్స్‌లో ఎలక్ట్రిక్ కార్ల విక్రయాలు ఒకశాతమే.. దిగుమతి సుంకాలు కూడా భారీగానే ఉన్నాయి. శరవేగంగా దూసుకెళ్లే టెస్లా కార్లకు భారత్ రోడ్లు అనువుగా ఉంటాయా? అన్న సందేహాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో భారత్‌లో టెస్లా ఎంట్రీ సక్సెస్ అవుతుందా.. లేదా.. అనుమానాలు ఉన్నాయి.
అమెరికా నుంచి దిగుమతి కానున్న టెస్లా కార్లపై పాక్షికంగా కస్టమ్స్ డ్యూటీని కేంద్రం తగ్గించనున్నట్లు వార్తలొచ్చాయి. భారత్‌లో పెట్టుబడి ప్రణాళికపై వివరాలివ్వాలని టెస్లా మేనేజ్మెంట్ను కేంద్ర ప్రభుత్వ వర్గాలు కోరాయి. దీనిపై టెస్లా నివేదికను బట్టే కస్టమ్స్ సుంకం తగ్గించాలన్న నిర్ణయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని వివిధ మంత్రిత్వశాఖలు పేర్కొన్నాయి.
టెస్లా కార్లు ప్రయాణించడానికి భారతీయ రోడ్లు అనువైనవేనని కేంద్ర రోడ్డు, రవాణా మంత్రిత్వశాఖ ధ్రువీకరించింది. భారత్ మార్కెట్‌కు టెస్లా సూటబుల్ అని, కర్బన ఉద్గారాల నియంత్రణ, భద్రతా ప్రమాణాలను పాటిస్తున్నదని ఆ శాఖ వెబ్సైట్ తెలిపింది. భారత్ మార్కెట్లోకి మోడల్3, మోడల్ వై వేరియంట్లు రావచ్చునని టెస్లా ఫ్యాన్ క్లబ్ ఇటీవల ట్వీట్ చేసింది.
టెస్లాలో చౌకగా లభించే కారు మోడల్-3. అమెరికా మార్కెట్లో దీని ధర 40 వేల డాలర్లు. ఒకసారి చార్జింగ్ చేస్తే 263 కి.మీ. దూరం వరకు ప్రయాణించొచ్చు. ఐదుగురు ప్రయాణించడానికి వీలుగా సీట్లు ఉంటాయి. 5.3 సెకన్లలో 90 కి.మీ. స్పీడందుకునే సామర్థ్యం గల టెస్లా మోడల్-3 కారు గరిష్ఠంగా 140 కి.మీ. వేగంతో దూసుకెళ్తుంది.
మోడల్ వై కారులో ఏడుగురు కూర్చునేందుకు సీటింగ్ ఉంది. అమెరికా మార్కెట్లో దీని ధర 54 వేల డాలర్లు. సింగిల్ చార్జింగ్‌తో 326 కి.మీ. దూరం ప్రయాణించగలుగుతుంది. కేవలం 4.8 సెకన్లలో 90 కి.మీ వేగంతో దూసుకెళ్తుంది. గంటకు గరిష్ఠంగా 135 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుంది.
విదేశాల నుంచి దిగుమతి చేసుకుని మార్కెట్లో పరిస్థితులను టెస్ట్ చేసుకునేందుకు వీలవుతుంది. దేశీయంగా ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడంపైనే దాని సక్సెస్ ఆధారపడి ఉంటుంది. భారత్‌లో దిగుమతి సుంకాలు ఎక్కువగా ఉన్నాయని టెస్లా సీఈవో ఎలన్ మస్క్ పేర్కొన్నారు. పన్నులతో సరిపోల్చి చూసుకుంటే పెట్రోల్ లేదా డీజిల్ వేరియంట్ కార్లతో టెస్లా ఒక్కటేనన్న అభిప్రాయం వినిపిస్తోంది.
తమ కార్లను లగ్జరీ కార్లుగా చూడొద్దని, ఎలక్ట్రిక్ వెహికిల్స్‌గా చూడాలని టెస్లా కోరింది. దేశీయంగా పూర్తిగా అసెంబ్లింగ్ చేసిన కార్లపై దిగుమతి సుంకం 40 శాతం తగ్గించాలని టెస్లా డిమాండ్ చేస్తున్నది. 40 వేల డాలర్ల లోపు విలువ గల కార్లపై 60 శాతం, 40 వేల డాలర్లకంటే ఎక్కువ ధర కార్లపై 100 శాతం దిగుమతి సుంకం తగ్గించాలని కోరుతున్నది. తమ కార్లను లగ్జరీ కార్లుగా చూడొద్దని, ఎలక్ట్రిక్ వెహికల్స్‌గా చూడాలని అభ్యర్థిస్తోంది.