Bandhan Bank | బంధన్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ కం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ)గా చంద్రశేఖర్ ఘోష్ వైదొలగనున్నారు. వచ్చే జూలై తొమ్మిదో తేదీతో ఆయన పదవీ కాలం ముగియనున్నది. బంధన్ గ్రూపు సంస్థల్లో ఆయన వ్యూహాత్మక పాత్ర పోషిస్తారని బ్యాంక్ ఓ ప్రకటనలో తెలిపింది. దాదాపు దశాబ్ధ కాలం బంధన్ బ్యాంక్ ఎండీ కం సీఈఓగా మూడు టర్మ్‌లు చంద్రశేఖర్ ఘోష్ పని చేశారు. ఈ నేపథ్యంలో బంధన్ గ్రూపు సంస్థల్లో కీలక బాధ్యతలను చేపట్టనున్న తాను బ్యాంక్ ఎండీ కం సీఈఓగా జూలై 9న వైదొలుగుతున్నానంటూ బోర్డుకు లేఖ రాశారు. తన నిర్ణయాన్ని ఆమోదించాలని కోరారు.
1985లో బంగ్లాదేశ్ లోని ఢాకా యూనివర్సిటీలో చంద్రశేఖర్ ఘోష్.. ఎంఏ స్టాటిస్టిక్స్ పూర్తి చేశారు. తర్వాత ఢాకా కేంద్రంగా పని చేస్తున్న బ్రాక్ (BRAC) అనే అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలో పని చేశారు. బంగ్లాదేశ్ లోని చిన్న గ్రామాల్లో మహిళల సాధికారత కోసం ఈ సంస్థ పని చేసింది. పూర్తిగా దారిద్ర్యంలో మగ్గుతున్న మహిళల పట్ల భర్తలు అనుచితంగా ప్రవర్తించడం చూసిన చంద్రశేఖర్ ఘోష్..చేతిలో డబ్బు ఉంటేనే మహిళల జీవితాలు బాగవుతాయని విశ్వసించారు. అందులో భాగంగానే 2009లో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీగా బంధన్ సంస్థను రిజిస్టర్ చేశారు. తొలి మైక్రో ఫైనాన్స్ సంస్థగా రూపుదిద్దుకున్న బంధన్.. 2014లో బ్యాంకింగ్ లైసెన్స్ అందుకున్నది.