న్యూఢిల్లీ, డిసెంబర్ 24: అవాంఛిత కాల్స్ లేదా ఆయాచిత వాణిజ్య ఎస్ఎంఎస్లు చెక్ పెట్టడానికి కేంద్రం సిద్ధమైంది. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలు రూపొందిస్తున్నట్లు, వచ్చే నెలలో వీటిని విడుదల చేయబోతున్నట్లు వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి నిధి ఖారే తెలిపారు. వాటాదారుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా రూపొందించిన ఈ మార్గదర్శకాలు టెలికం నియంత్రణ మండలి ట్రాయ్ నిబంధనలకు అనుగుణంగా ఉంటుందని జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన చెప్పారు. వ్యాపార సంస్థల పాత్రకు సంబంధించి మార్గదర్శకాల రూపకల్పనలో మంత్రిత్వ శాఖ కీలకంగా చర్చిస్తున్నదన్నారు.
ఉద్యోగ కల్పనపై దృష్టి సారించండి ; ప్రధానికి ఆర్థిక వేత్తల సూచన
న్యూఢిల్లీ, డిసెంబర్ 24: వచ్చే సార్వత్రిక బడ్జెట్లో తీసుకునే నిర్ణయాలపై ప్రధాన ఆర్థికవేత్తలతో ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఉద్యోగ కల్పన, వ్యవసాయక ఉత్పాదకత, మౌలిక సదుపాయాల కోసం ప్రభుత్వం కేటాయించే నిధులు పెంచాలని ఈ సందర్భంగా ప్రధానికి ఆర్థికవేత్తలు సూచించారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు, భౌగోళిక రాజకీయ ఒత్తిళ్లు, ముఖ్యంగా యువతలో ఉపాధిని పెంపొందించే వ్యూహాలు, ఆయా రంగాల్లో స్థిరమైన ఉద్యోగాలు సృష్టించడం వంటి అనేక సమస్యలకు పరిష్కారం చూపాలని ఆర్థికవేత్తలు సూచించారు.