Cement Prices | న్యూఢిల్లీ, అక్టోబర్ 5: సిమెంట్ ధరలు భగ్గుమనే అవకాశాలనున్నాయి. గత కొన్ని రోజులుగా నిలకడ స్థాయిలో ఉన్న ధరలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడు, నాలుగో త్రైమాసికాల్లో వీటి ధరలు పెంచేందుకు కంపెనీలు సిద్ధమవుతున్నాయని సెంట్రమ్ నివేదిక వెల్లడించింది.
తొలి ఆరు నెలల్లో అత్యధికంగా వర్షాలు కురియడంతో డిమాండ్ భారీగా పడిపోయిందని, రెండో అర్థభాగం నాటికి డిమాండ్ 5 శాతంగా ఉంటుందని, దీంతో కంపెనీలు సిమెంట్ ధరలను పెంచేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపింది.
సార్వత్రిక ఎన్నికల తర్వాత కొత్తగా ఏర్పడిన ప్రభుత్వ వ్యయాలు ఆలస్యం కావడం, రుతుపవనాల ప్రభావంతో ఈ ఏడాది అత్యధికంగా వర్షాలు కురియడం డిమాండ్‌పై పిడుగు పడినట్లు అయింది. దక్షిణాదితోపాటు ఉత్తర, సెంట్రల్ ప్రాంతాల్లో సిమెంట్‌కు డిమాండ్ లేకపోవడంతో ఏడాది ప్రాతిపదికన డిమాండ్ 20 శాతం వరకు పడిపోయిందని తెలిపింది. ఇదే సమయంలో భవిష్యత్తులో డిమాండ్ ఉంటుందన్న అంచనాతో కంపెనీలు తమ ప్లాంట్ల సామర్థ్యాన్ని భారీగా పెంచుకున్నాయి కూడా.