అత్యవసరంగా వెళ్లిన దవాఖానలో మన ఆరోగ్య బీమాకు క్యాష్‌లెస్ చికిత్స సదుపాయం లేదని చెప్తే.. ఆ బాధ చెప్పరానిదే. అందుకే బీమా రంగ రెగ్యులేటర్ ఐఆర్డీఏఐ ఇటీవల కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ‘స్టాండర్డ్స్ అండ్ బెంచ్‌మార్క్స్ ఫర్ ది హాస్పిటల్స్ ఇన్ ది ప్రొవైడర్ నెట్వర్క్’ పేరుతో వీటిని విడుదల చేసింది. దీంతో ఎంచుకున్న దవాఖానలో ఆరోగ్య బీమా పాలసీ కింద క్యాష్‌లెస్ చికిత్స సులభతరమవుతున్నది.
ఈ నెల 20న ఇచ్చిన ఓ సర్క్యులర్‌లో.. బీమా సంస్థల నెట్వర్క్ పరిధిలో ఉన్న దవాఖానలు.. ఆయా సంస్థల బోర్డులు తీసుకున్న నిర్ణయాల మేరకు పనిచేయాల్సిందేనని ఐఆర్డీఏఐ స్పష్టం చేసింది. దవాఖానల ఎంపిక సమయంలో కనీస సిబ్బంది, మెరుగైన ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలకూ బీమా సంస్థల బోర్డులు ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేసింది. దీంతో ఆరోగ్య బీమా పాలసీదారులు తమ బీమా సంస్థ నెట్వర్క్ పరిధిలో ఉన్న దవాఖానలకు వెళ్లినప్పుడు అత్యున్నత ప్రమాణాలతో కూడిన చికిత్సను అందించడమేగాక, క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్‌కూ సదరు దవాఖాన యాజమాన్యాలు అంగీకరించాల్సిందే. ఇప్పటిదాకా క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ ఆమోదానికి దవాఖానల్లో పెద్ద గజిబిజి ప్రక్రియే ఉండేది.
ఇన్సూరర్ల నెట్‌వర్క్‌లో దవాఖానలకు చెందిన ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్ బ్యూరో రిజిస్ట్రీతో నమోదు, నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్ అండ్ హెల్త్‌కేర్ (ఎన్ఏబీహెచ్) ప్రొవైడర్స్ జారీ చేసిన ఎంట్రీ లెవల్ సర్టిఫికేషన్ లేదా నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్ కింద నేషనల్ హెల్త్ సిస్టమ్స్ రిసోర్సెస్ సెంటర్ (ఎన్హెచ్ఎస్ఆర్సీ) జారీ చేసిన స్టేట్ లెవల్ సర్టిఫికెట్లు పొందాల్సి వచ్చేది. ఇప్పుడీ తతంగాన్ని సవరించింది. ఐఆర్డీఏఐ తీసుకున్న నిర్ణయం పేద, మధ్యతరగతి వర్గాల్లో ఆరోగ్య బీమాపట్ల నమ్మకాన్ని పెంచగలదని బీమా పరిశ్రమ హర్షం వ్యక్తం చేస్తున్నది.