అతని పేరు ఆశిష్. ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగి. ఇంకా పెండ్లి కాలేదు. హైదరాబాద్లో తన తల్లిదండ్రులతో కలిసి జీవిస్తున్నాడు. ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) వంటి ఉద్యోగులకుండే తప్పనిసరి వార్షిక పొదుపులు మినహా పెద్దగా ఎటువంటి ఆర్థిక ప్రణాళికలూ లేని వ్యక్తి. ఖర్చులు విపరీతం. ముఖ్యంగా క్రెడిట్ కార్డులపై బోలెడు బకాయిలున్నాయి. ఇదంతా చూసిన ఆశిష్ తల్లిదండ్రులది.. ఓ ఇల్లు కొనుక్కున్నా అనవసరపు ఖర్చులు తగ్గి కొడుకు దారిలో పడుతాడన్న ఆలోచన. ఆశిష్ సైతం ఇదే యోచనలో ఉన్నాడు. ఇంటి కొనుగోలు వంటి దీర్ఘకాలిక పెట్టుబడికి ఇదే సరైన సమయం అన్నది అతని అభిప్రాయం. ఆశిష్, తన తల్లిదండ్రుల తరహాలోనే ఇప్పుడు చాలామందిది ఇదే ఆలోచన. అయితే దీర్ఘకాలిక సేవింగ్స్ కోసం ఇల్లే కొనాలా? అన్నది ఇక్కడి ప్రశ్న. దీనిపై నిపుణుల మాటకొస్తే..
అవసరమైతే తప్ప ఇలాంటి భారీ ఫైనాన్షియల్ కమిట్మెంట్కు వెళ్లవద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఇల్లు కొనుగోలు అనేది పెట్టుబడి వైపు నుంచి చూడకూడదని సలహా ఇస్తున్నారు. ఆదాయం సరిపడాలేని ఇటువంటి సమయంలో తొందరపాటు నిర్ణయాలు మరిన్ని ఇబ్బందులకు దారితీస్తాయని అంటున్నారు. కాబట్టి ఎవరైనాసరే తమ అవసరాలను ముందుగా తెలుసుకుని ఓ నిర్ణయానికి వస్తే బాగుంటుందని చెప్తున్నారు. పొదుపుపై ఆలోచనలు లేకుండా, ఖర్చులపై నియంత్రణ లేనివారికి భారీ లక్ష్యాన్ని అప్పజెప్పడం ఎన్నో అనర్థాలకు దారితీస్తుందని కూడా వారు హెచ్చరిస్తున్నారు. క్రెడిట్ స్కోర్ సరిగా లేకున్నా బలవంతంగా అధిక వడ్డీలపై రుణాలు తీసుకుని, ఇల్లు కొంటే తీవ్రమైన ఒత్తిళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని కూడా పేర్కొంటున్నారు. ఆర్థిక క్రమశిక్షణను అలవర్చుకుని, కొంత నగదును సమకూర్చుకుని ముందుకెళ్తే విజయం సొంతమవుతుందని హితవు పలుకుతున్నారు.