హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్ట్ 22 (నమస్తే తెలంగాణ): టీజీఎస్పీడీసీఎల్ తన వినియోగదారులను లక్ష్యంగా చేసుకుంటున్నది. ఆదాయ వనరులను అన్వేషించే క్రమంలో తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలు వారికి షాకిస్తున్నాయి. గతంలో 20 కిలోవాట్ల లోడ్ ఉన్న ప్రతి ఇంటికీ ట్రాన్స్ఫార్మర్ బిగించాలని నిర్ణయించారు. ఇప్పుడు మాత్రం వినియోగదారులు అడిగినంత లోడ్ ఇవ్వకుండా ఇంట్లో ఉన్న గదుల ప్రకారం విద్యుత్తు సంస్థే లోడ్‌ను నిర్ణయిస్తూ అవసరం లేకుండానే అధిక లోడ్‌ను వారిపై మోపుతున్నది.
వెంచర్లు, లేఔట్లు, హైరైజ్ బిల్డింగ్లు నిర్మించేటప్పుడు తమకు జాగా ఇవ్వాలని కండిషన్ పెట్టినట్టు తెలిసింది. వాస్తవానికి వినియోగదారుడు కోరినంత లోడ్ మంజూరు చేసి సర్వీస్ రిలీజ్ చేయాలి. ఆర్ఎండీ ప్రకారం సదరు సర్వీసులో వాడుతున్న లోడ్ అనుమతి తీసుకున్న దానికంటే ఎక్కువ ఉంటే ఆ ప్రాంత విద్యుత్తు అధికారి తనిఖీ చేసి ఇంటిలో వాడుతున్న విద్యుత్తు పరికరాల ప్రకారం లోడ్ లెక్కించి, ఎక్కువ లోడ్ కోసం డెవలప్మెంట్ చార్జీలు చెల్లించాలని నోటీసులు జారీచేయాలి. నెల రోజుల అనంతరం వినియోగదారుడు వాడుతున్న లోడ్‌ను బట్టి నిర్ణయం తీసుకోవాలి. కానీ డిస్కం జారీచేసిన ఉత్వర్వుల్లో మాత్రం సింగిల్ బెడ్రూంకు రెండు కిలోవాట్లు, డబుల్ బెడ్రూంకు 5 కిలోవాట్లు, ట్రిపుల్ బెడ్రూమ్కు 10 కిలోవాట్లు, నాలుగు బెడ్రూంల ఇంటికి 15 కిలోవాట్ల చొప్పున లోడ్ నిర్ణయించారు.
ట్రాన్స్ఫార్మర్ తీసుకున్న వినియోగదారుడు 11కేవీ లైన్ ఎంత దూరం ఉంటే అంత మేరకు అండర్‌గ్రౌండ్ కేబుల్ ఎస్టిమేషన్‌తో ఇవ్వాలని టీజీఎస్పీడీసీఎల్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఒక వినియోగదారుడు కొత్త కనెక్షన్ తీసుకునే ముందు 11కేవీ లైన్ నాలుగైదువందల మీటర్ల దూరం ఉంటే అక్కడికి అండర్‌గ్రౌండ్ కేబుల్ వేయడానికి ఎస్టిమేషన్ రూపొందించాలి. మధ్యలో వేరే వాళ్ల ప్లాట్లు ఉంటే వాటిలో తవ్వకాలు సాధ్యపడవు. నడిరోడ్డుపై తవ్వుతామంటే జీహెచ్ఎంసీ ఒప్పుకోదు. ఇలా అన్ని రకాల సమస్యలు ఉంటాయి.
డిస్కం అధికారులు గత ఇరవై నెలల కాలంలో జారీచేస్తున్న ఉత్తర్వులు, తీసుకుంటున్న నిర్ణయాలు వినియోగదారులపై భారాన్ని మోపుతున్నాయి. ఒకవైపు గదుల వారీగా లోడ్ నిర్ణయిస్తామని చెప్పిన డిస్కం గతంలో 20 కేవీ దాటితే ట్రాన్స్ఫార్మర్ పెట్టుకోవాలంటూ ఆదేశాలిచ్చింది. అంతేకాకుండా జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలోని మల్టీస్టోర్డ్ బిల్డింగులు, గేటెడ్ కమ్యూనిటీ విల్లాలు, ఓపెన్ప్లాట్ లేఔట్లకు లోడ్ ఇవ్వాలంటే సబ్స్టేషన్లు నిర్మించాలంటూ డీజీఎస్పీడీసీఎల్కు 800 నుంచి 1500 చదరపు గజాలు కేటాయించాలని గతంలో మరో ఉత్తర్వులిచ్చింది. ఇవన్నీ ఒక ఎత్తైతే కాంట్రాక్టర్లకు గానీ, విద్యుత్తు సిబ్బందికి గానీ ఇస్తున్న ఉత్తర్వుల్లో చాలావరకు అమలుచేయలేని పరిస్థితి ఉందని, కేబుల్ లేని పరిస్థితుల్లో సమ్మర్ యాక్షన్ ప్లాన్ చేయలేకపోవడమేనని దీనికి ఉదాహరణగా కాంట్రాక్టర్లు చెప్తున్నారు.
అధికారులు జారీచేసిన ఉత్వర్వుల్లో గదుల వారీ లోడ్ పెంచడానికి పేర్కొన్న నిబంధనలు హాస్యాస్పదంగా ఉన్నాయని కాంట్రాక్టర్లు అంటున్నారు. ఇటీవల జరుగుతున్న అగ్ని ప్రమాదాల నేపథ్యంలో గదుల ప్రకారం లోడ్ ఇవ్వాలని నిర్ణయిస్తున్నట్టు ఎస్పీడీసీఎల్ జారీచేసిన ఉత్తర్వులో పేర్కొనడం గమనార్హం. ఇటీవల కాలంలో జరిగిన అన్ని అగ్ని ప్రమాదాలకు లోడ్ కంటే అందులో వాడిన పాత కేబుళ్లే కారణమని తేలింది. సబ్స్టేషన్ల నిర్మాణానికి రెవెన్యూ అధికారులతో మాట్లాడి వారి సమన్వయంతో చేయాల్సిన చోట ఇప్పుడు ఈ నిర్ణయం ఏంటంటూ వెంచర్ల నిర్వాహకులు ప్రశ్నిస్తున్నారు. దక్షిణ డిస్కం తాను ఒక కొత్త కనెక్షన్ ఇచ్చే సందర్భంలో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్‌తో పాటు జీహెచ్ఎంసీ పర్మిషన్, ఎన్వోసీ, ఓసీ తదితర సర్టిఫికెట్లు చూస్తుంది. కానీ గత ఆరు తరాలకు సంబంధించిన డాక్యుమెంట్లు కావాలని అడిగిన సందర్భం మాత్రం ఒక్క డిస్కంకే చెల్లిందని, సంబంధిత అధికారులు ఏదో ఒక సాకు చూపి కనెక్షన్లు ఇవ్వకుండా సతాయించడానికే ఇలా వ్యవహరిస్తున్నారని వినియోగదారులు వాపోతున్నారు. అసలు ఆరుతరాల డాక్యుమెంట్స్ వీరికి ఎందుకని ప్రశ్నిస్తున్నారు.