మీరు ఓ ఇల్లు లేదా అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనాలని అనుకుంటున్నారా? అయితే మీరు కొంటు న్న ప్రాపర్టీ కచ్చితమైన పరిమాణం ఎంత? అన్నది మీకు తప్పక తెలియాలి. అప్పుడే దేనికి చెల్లిస్తున్నాం? అన్నది తెలుస్తుంది. బిల్డర్లు, బ్రోకర్లు ప్రాపర్టీ సైజ్‌ను చెప్పేటప్పుడు కొన్ని రకాల కొలమానాలను వాడుతూ ఉంటారు. అవి ఇంటి కొనుగోలుదారులను ఇట్టే గందరగోళంలో పడేసి, తప్పుడు నిర్ణయాలను తీసుకునేందుకు దారి తీయగలవు. మరి సదరు కొలమానాలు ఏమిటి? వాటి మధ్య ఉన్న తేడాలు ఏంటి? అన్నది తెలుసుకుందాం.
కార్పెట్ ఏరియా
ఇల్లు లేదా ఫ్లాట్ లోపల మనం వాడుకోవడానికి ఉన్న స్థలమే (స్పేస్ విత్ ఇన్ ది ఇంటీరియర్ వాల్స్) కార్పెట్ ఏరియా. కామన్ ఏరియాలు, బాల్కనీలు, టెరస్ లేదా షాఫ్ట్స్ ఇందులోకి రావు. పడక గదులు, వాష్‌రూంలు, లివింగ్ ఏరియా, వంట గది స్థలాలు ఇందులో ఉంటాయి. సాధారణంగా బిల్ట్-అప్ ఏరియాలో కార్పెట్ ఏరియా దాదాపు 70 శాతంగా ఉంటుంది. అయితే రియల్ ఎస్టేట్ (రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్) చట్టం 2016 ప్రకారం.. కార్పెట్ ఏరియాను ప్రాపర్టీలో నికరంగా వినియోగించే స్థలంగా పేర్కొన్నారు. బయటి గోడలు, ఎక్స్‌క్లూజివ్ బాల్కనీ, వరండా, టెరస్ ఇందులోకి రావు.
బిల్ట్-అప్ ఏరియా
ఇది ఇల్లు లేదా ఫ్లాట్ మొత్తం ఏరియాను సూచిస్తుంది. కార్పెట్ ఏరియా కూడా ఇందులోనే కలిసి ఉంటుంది. ఇంటి లోపలి, బయటి గోడలు, బాల్కనీ, వరండా, టెరస్లూ భాగమే. అందువల్ల బిల్ట్-అప్ ఏరియా.. కార్పెట్ ఏరియా కంటే పెద్దదిగా ఉంటుంది. అందుకే చాలామంది బిల్డర్లు, బ్రోకర్లు తమ ప్రాపర్టీల మార్కెటింగ్ కోసం ఇటీవలికాలంలో ఈ బిల్ట్-అప్ ఏరియానే ఎక్కువగా వాడుతూ ఉన్నారు.
సూపర్ బిల్ట్-అప్ ఏరియా
ఇందులో బిల్ట్-అప్ ఏరియా కలిసిపోయి ఉం టుంది. అపార్ట్మెంట్ కామన్ ఏరియాలైన లిఫ్ట్ లా బీ, షాఫ్ట్, కారిడార్లు, మెట్లు వంటివన్నింటిలో దామాషా వాటా కూడా కలుస్తుంది. కొందరు డెవలపర్లు స్విమ్మింగ్ పూల్, పార్కులు, క్లబ్‌హౌజ్, పార్కింగ్ స్పేస్ వంటివీ చూపిస్తున్నారు.
కొనుగోలుదారులూ పారాహుషార్
నిర్మాణ రంగంలో అనేక మోసాలు జరుగుతున్నాయి. ఆకాశన్నంటుతున్న భూముల ధరలు, మితిమీరిన నిర్మాణ ఖర్చులు వంటివి ఇందుకు దోహదం చేస్తున్నాయి. ఇక కొనుగోలుదారుల అమాయకత్వం కూడా మోసగాళ్లకు వరంగా మారుతున్నది. కాబట్టి ఇంటిని కొనేటప్పుడు అన్నింటినీ క్షుణ్ణంగా గమనించడం ఉత్తమం. స్థల పురాణం, డాక్యుమెంట్లు, అనుమతులతోపాటు నిర్మాణ నాణ్యతనూ పరిశీలించాలి. డబుల్ రిజిస్ట్రేషన్లపైనా ఆరా తీయాలి. నిబంధనల్ని పాటించే నిర్మాణం జరిగిందా? అన్నది చూసుకోవడమేగాక, ఆస్తి విలువ, సదరు ఏరియా, చుట్టుపక్కల ఉన్న సదుపాయాలు, వసతులు, రుణ లభ్యత వంటి వాటిని గమనించి ఓ నిర్ణయం తీసుకుంటే మంచిది. ఫ్లాట్ ఎస్ఎఫ్టీ, హౌస్ స్కేర్ యార్డ్స్ అన్నింటినీ సరిచూసుకోవాలి. అవసరమైతే న్యాయ, ఆర్థిక నిపుణుల సలహాలనూ తీసుకోవడం లాభదాయకం.