Build Now Portal | హైదరాబాద్, జనవరి 30 (నమస్తే తెలంగాణ): రియల్ అనుమతులు పొందడం ఇక సులభతరమే అని ఆశలు పెట్టుకున్న వ్యాపారులకు నిరాశే దక్కింది. ప్రభుత్వం ప్రకటించిన బిల్డ్ నౌ పోర్టల్‌కు ఆటంకాలు మొదలయ్యాయి. కొత్త పోర్టల్‌కి సంబంధించిన సాఫ్ట్వేర్ అందుబాటులోకి రాలేదని తెలిసింది. ఎప్పుడు అందుబాటులోకి వస్తుందన్న అంశంపైనా క్లారిటీ లేకుండా పోయింది. దీంతో వ్యాపారస్తులు పాత విధానంలోనే దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది.
‘బిల్డ్ నౌ’ పేరిట కొత్త పోర్టల్ విధానాన్ని ఫిబ్రవరి 1నుంచి అమల్లోకి తీసుకువస్తున్నట్టు స్వయంగా మంత్రి శ్రీధర్‌బాబు గత నెల మొదటి వారంలో అధికారికంగా ప్రకటించారు. కానీ ఆ మేరకు చర్యలు తీసుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నట్టు కనిపించటంలేదు. రియల్ అనుమతుల కోసం జీహెచ్ఎంసీ, మున్సిపాలిటీ, డీటీసీపీ వంటి విభాగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఏఐ సహకారంతో బిల్డ్ నౌ పోర్టల్ విధానాన్ని తెరపైకి తెచ్చారు. కానీ, సంస్థల నుంచి అనుమతులు పొందడంతోపాటు అధికారులు ఏ విధంగా దరఖాస్తులు స్వీకరించి, అనుమతులు మంజూరు చేయాలన్న అంశాలపై ఇప్పటికీ శిక్షణ ఇవ్వలేదు.