BSE Market Capitalisation | ఈ నెల 12 నుంచి ఇప్పటి వరకు బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.17 లక్షల కోట్లు పెరిగి రూ.257.99 లక్షల కోట్లకు పెరిగింది. ఎల్ఐసీ మెగా ఐపీవోతోపాటు పలు కంపెనీల లిస్టింగ్, అంతర్జాతీయంగా సానుకూల పరిణామాలు ఏర్పడటంతో ఇన్వెస్టర్లలో పాజిటివ్ సెంటిమెంట్ బలపడింది. ఫలితంగా బీఎస్ఈ-500లోని 20 స్టాక్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ కనీసం రూ.10 వేల కోట్ల చొప్పున పెరిగి వాటి మొత్తం ఎం-క్యాప్ సుమారు రూ.6.75 లక్షల కోట్లు జత కలిసి ఉంటుందని అంచనా.
రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఈ నెల 12 నుంచి (12 వరుస ట్రేడింగ్‌లు) సోమవారం వరకు ఇంట్రాడే ట్రేడింగ్‌లో రూ.1.67 లక్షల కోట్లు పెంచుకున్నది. రూ.16.24 లక్షల కోట్ల నుంచి రూ.17.91 లక్షల కోట్లకు చేరుకున్నది.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.57,289 కోట్లు పెరిగి రూ.7.23 లక్షల కోట్ల నుంచి రూ.7.80 లక్షల కోట్లకు దూసుకెళ్లింది. హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్‌యూఎల్) రూ.48,000 కోట్లు, హెచ్డీఎఫ్సీ రూ.41,921 కోట్లు, ఐసీఐసీఐ బ్యాంక్ రూ. 37,055 కోట్లు, అదానీ పవర్ రూ.34,850 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ పెంచుకున్నాయి. ఇంకా బజాజ్ ఫైనాన్స్ రూ.31,785 కోట్లు, అవెన్యూ సూపర్ మార్కెట్ రూ.31,291 కోట్ల ఎం-క్యాప్ పెరిగింది.
అదానీ టోటల్ గ్యాస్, కొటక్ మహీంద్రా బ్యాంక్, టాటా మోటార్స్, మారుతి సుజుకి, ఐటీసీ, నెస్ట్లే ఇండియా మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.15 వేల నుంచి రూ.30 వేల కోట్ల మధ్య వృద్ధి చెందింది. ఈ నెల 17న స్టాక్ మార్కెట్లలో లిస్టయిన ఎల్ఐసీ ఎం-క్యాప్ రూ.5,28,137.31 కోట్లకు చేరుకున్నది.
అదానీ పవర్ షేర్ 35 శాతం వృద్ధి చెందితే, ఎల్గీ ఎక్విప్మెంట్స్ 28 శాతం, వెల్స్పన్ కార్పొరేషన్ స్క్రిప్ట్ 22 శాతం పెరిగింది. స్ట్రైడ్స్ ఫార్మాసైన్స్, ఐఆర్బీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్, టాటా ఎలిక్సీ, ఆస్ట్రాజెనకా ఫార్మా, అస్టర్ డీఎం హెల్త్‌కేర్, గుజరాత్ ఫ్లోరో కెమికల్స్ తదితర షేర్లు 20 శాతానికి పైగా రాణించాయి.