న్యూఢిల్లీ, అక్టోబర్ 15: ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర(బీవోఎం) ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.1,327 కోట్ల నికర లాభాన్ని గడించింది. వడ్డీల మీద వచ్చే ఆదాయం పెరగడం వల్లనే క్రితంఏడాది ఇదే త్రైమాసికంలో నమదైన రూ.920 కోట్ల లాభంతో పోలిస్తే 44 శాతం ఎగబాకింది. సమీక్షకాలంలో బ్యాంక్ ఆదాయం రూ.5,736 కోట్ల నుంచి రూ.6,809 కోట్లకు చేరుకున్నట్లు బీవోఎం ఎండీ నిధు సక్సేనా తెలిపారు. నికర వడ్డీ మార్జిన్ 3.88 శాతం నుంచి 3.98 శాతానికి చేరుకున్నట్లు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే బ్యాంక్ రూ.5 వేల కోట్ల నికర లాభాన్ని ఆర్జించగలదనే నమ్మకాన్ని ఆయన వ్యక్తంచేశారు. బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తుల విలువ 2.19 శాతం నుంచి 1.84 శాతానికి దిగిరాగా, నికర ఎన్పీఏ 0.23 శాతం నుంచి 0.20 శాతానికి దిగొచ్చింది. మొండి బకాయిలను పూడ్చుకోవడానికి బ్యాంక్ రూ.598 కోట్ల నిధులను వెచ్చించింది.