నూఢిల్లీ, ఏప్రిల్ 24: బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర(బీవోఎం) ఆర్థిక ఫలితాల్లో రాణించింది. మార్చితో ముగిసిన త్రైమాసికానికిగాను రూ.840 కోట్ల నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.355 కోట్ల కంటే రెండింతలు పెరిగింది. మొండి బకాయిలు తగ్గుముఖం పట్టడం, వడ్డీ ఆదాయం పెరగడం వల్లనే లాభాల్లో భారీ వృద్ధి నమోదైందని పేర్కొంది. గత త్రైమాసికంలో బ్యాంక్ ఆదాయం రూ.3,949 కోట్ల నుంచి రూ.5,317 కోట్లకు చేరుకున్నట్లు బీవోఎం ఎండీ, ఏఎస్ రాజీవ్ తెలిపారు. ప్రస్తుత త్రైమాసికంలో షేర్లను విక్రయించడం ద్వారా రూ.1,000 కోట్ల నిధులను సేకరించాలనుకుంటున్నట్టు, తద్వారా బ్యాంక్‌లో ప్రజల వాటా పెరుగుతున్నదన్నారు. మరోవైపు, గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను రూ.10 ముఖ విలువ కలిగిన ప్రతిషేరుకు రూ.1.30 లేదా 13 శాతం డివిడెండ్‌ను బోర్డు ప్రతిపాదించింది.