న్యూఢిల్లీ, జూన్ 12: ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర(బీవోఎం) వడ్డీరేట్లను అర శాతం వరకు తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. దీంతో గృహ, వాహన, విద్యా రుణాలతోపాటు రెపో లింక్డ్ లెండింగ్ రేటుతో అనుసంధానమైన అన్ని రకాల రుణాలపై వడ్డీరేట్లు దిగివచ్చాయి. తగ్గిన వడ్డీరేట్లు ఈ నెల 10 నుంచే అమలులోకి వచ్చాయని బ్యాంక్ పేర్కొంది.
బ్యాంక్ తీసుకున్న తాజా నిర్ణయంతో 7.35 శాతం ప్రారంభంతో గృహ రుణాలు, 7.7 శాతం ప్రారంభంతో వాహన రుణాలు లభించనున్నాయి. బ్యాంకింగ్ రంగంలో ఇదే అతి తక్కువ వడ్డీరేట్లు కావడం విశేషం. మరోవైపు, బ్యాంక్ ఆఫ్ బరోడా మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటుని ఐదు బేసిస్ పాయింట్లు తగ్గించింది. నెల నుంచి ఏడాది లోపు కాలపరిమితి కలిగిన రుణాలకు ఈ తగ్గింపు వర్తించనున్నది.