న్యూఢిల్లీ, ఆగస్టు 11: ప్రభుత్వరంగ బ్యాంకులు మళ్లీ వడ్డీరేట్ల పెంపును ప్రారంభించాయి. ఇప్పటికే వడ్డీరేట్లు గరిష్ఠ స్థాయికి చేరుకోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రుణ గ్రహీతలకు పీఎస్బీలు షాకిచ్చాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ), బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర(బీవోఎం), కెనరా బ్యాంక్లు తమ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్ఆర్)తో అనుసంధానమైన రుణాలపై వడ్డీరేట్లను 10 బేసిస్ పాయింట్ల వరకు పెంచాయి.
దీంతో ఎంసీఎల్ఆర్తో అనుసంధానమైన రుణాలపై నెలవారి చెల్లింపులు(ఈఎంఐ)లు మరింత భారంకానున్నాయి. ఏడాది కాలపరిమితి కలిగిన ఎంసీఎల్ఆర్ రేటు 8.65 శాతం నుంచి 8.70 శాతానికి పెంచినట్లు బీవోబీ వెల్లడించింది. ఈ రేట్లు శనివారం(ఆగస్టు 12) నుంచి అమలులోకి రానున్నాయి. అలాగే కెనరా బ్యాంక్ కూడా తన ఎంసీఎల్ఆర్ని 5 బేసిస్ పాయింట్లు పెంచడంతో రుణ రేటు 8.70 శాతానికి చేరుకున్నది. కానీ, బీవోఎం మాత్రం ఎంసీఎల్ఆర్ని 10 బేసిస్ పాయింట్లు సవరించడంతో ఏడాది కాలపరిమితి కలిగిన రేటు 8.50 శాతం నుంచి 8.60 శాతానికి పెంచింది. ఈ రేట్లు గురువారం నుంచే అమలులోకి వచ్చాయి.