Bit Coin | క్రిప్టో కరెన్సీ జెయింట్ బిట్ కాయిన్ తాజాగా 62 వేల డాలర్ల మార్క్‌ను దాటింది. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు ప్రస్తుతం బిట్ కాయిన్ విలువ 62,070 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది. గత ఏప్రిల్‌లో బిట్ కాయిన్ విలువ ఆల్‌టైం రికార్డు నమోదు చేసి 65 వేల డాలర్ల చేరువకు చేరుకుని క్రమేపీ పడిపోయింది. బిట్ కాయిన్ ఫ్యూచర్స్ మార్కెట్లో ట్రేడింగ్‌కు యూఎస్ సెక్యూరిటీస్ అనుమతి ఇస్తుందన్న సంకేతాల మధ్య దాని విలువ పెరిగింది.
ఈ నెలలో కేవలం 18 రోజుల్లో దీని విలువ 29 శాతం పెరిగింది. ఈ నెల ఒకటో తేదీన బిట్ కాయిన్ విలువ 48,160 డాలర్లుగా ఉంది. ఇప్పుడది 62,070 డాలర్లు పలుకుతోంది. ఈ నెల ఒకటో తేదీన 3,306 డాలర్లుగా ఉన్న ఏథీరియం విలువ ఇప్పుడు 3,851 డాలర్లకు దూసుకెళ్లింది.
ట్రేడింగ్‌కు యూఎస్ సెక్యూరిటీస్ అనుమతినిస్తే బిట్ కాయిన్ పైపైకి దూసుకెళుతుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. వచ్చే ఏడాది 90 వేల డాలర్ల మార్క్‌కు చేరుతుందని భావిస్తున్నారు. మూడు నెలల క్రితం బిట్ కాయిన్ విలువ 32 వేల డాలర్లు మాత్రమే.
భారత్‌లో 12-14 క్రిప్టో ఎక్స్చేంజ్లు వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్నాయి. రోజువారీగా భారత్‌లో క్రిప్టో కరెన్సీల టర్నోవర్ రూ.1000-1500 కోట్ల మధ్య ఉంటుంది. ఇక దేశంలో సుమారు 1.20 కోట్ల మంది ఇన్వెస్టర్లు క్రిప్టో కరెన్సీల్లో పెట్టుబడులు పెడుతున్నారు.