Bitcoin | బిట్ కాయిన్ సహా క్రిప్టో కరెన్సీలన్నీ నేల చూపులు చూస్తున్నాయి. గత నెల రోజుల్లో క్రిప్టో మేజర్ బిట్ కాయిన్ విలువ 35 శాతానికి పైగా తుడిచి పెట్టుకుపోయింది. సరిగ్గా నెల రోజుల క్రితం జూన్ నాలుగో తేదీన 29,681 డాలర్లు పలికిన బిట్ కాయిన్.. సోమవారం కాయిన్‌డెస్క్ డాట్ కామ్‌లో 19,124 డాలర్లకు పడిపోయింది. ఇది 35 శాతానికంటే ఎక్కువ. గత 11 ఏండ్లలో ఒక నెలలో బిట్ కాయిన్ పతనం కావడం ఇదే గరిష్ఠం.
గతేడాది నవంబర్‌లో ఆల్‌టైం రికార్డు నెలకొల్పి 69 వేల డాలర్ల మార్క్ దాటిన బిట్‌కాయిన్.. ఇప్పుడు 70 శాతానికి విలువ కోల్పోయింది. సోమవారం మధ్యాహ్నం 11.32 గంటల సమయానికి టాప్ 20 క్రిప్టో టోకెన్లు లాభాలు గడించాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి వల్ల క్రిప్టో కరెన్సీలు భారీగా ఒడిదొడుకులను ఎదుర్కొంటున్నాయి. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలను కట్టడి చేయడానికి వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు కీలక వడ్డీరేట్లు పెంచడంతో ఆర్థిక మాంద్యం ముప్పు ముంచుకొస్తున్నదన్న ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో క్రిప్టో కరెన్సీలకు అననుకూల పరిస్థితులే ఉన్నాయి.
దీనికితోడు క్రిప్టో కరెన్సీ లావాదేవీలపై కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పన్ను వ్యవస్థ.. మదుపర్లకు అనుకూలంగా లేదు. గత ఫిబ్రవరి ఒకటో తేదీన ప్రవేశపెట్టిన 2022-23 ఆర్థిక సంవత్సర బడ్జెట్లో క్రిప్టో కరెన్సీలపై పన్ను విధించడానికి ఆదాయం పన్ను చట్టంలో 115 బీబీహెచ్ సెక్షన్ చేర్చారు. ఈ సెక్షన్ ప్రకారం క్రిప్టో కరెన్సీల బదిలీల వచ్చే లాభాల మీద 30 శాతం పన్ను విధించాలని నిర్ణయించారు. క్రిప్టో కరెన్సీ లావాదేవీల్లో లాభ నష్టాలతో కూడా సంబంధం లేకుండా పన్ను చెల్లించాల్సిందే.
క్రిప్టో కరెన్సీల బదిలీలై ఒకశాతం టీడీఎస్ మినహాయించడానికి ఆదాయం పన్ను చట్టం (ఐటీ చట్టం)లో 194ఎస్ సెక్షన్ చేర్చారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలోనే ఈ నూతన పన్ను వ్యవస్థ అమల్లోకి వచ్చింది. ఇతర ఆదాయ వనరులతో పోలిస్తే క్రిప్టో కరెన్సీల ద్వారా వచ్చే ఆదాయంపైనే ఎక్కువ పన్ను విధిస్తోంది కేంద్రం.