Gautam Singhania | ప్రముఖ బిలియనీర్ గౌతం సింఘానియా దంపతులు విడిపోయారు. ఈ సంగతి గౌతం సింఘానియా సోమవారం ప్రకటించారు. వేర్వేరు మార్గాల్లో ప్రయాణించేందుకు తామిద్దరం నిర్ణయించుకున్నామని పేర్కొన్నారు. 1999లో సొలిసిటర్ నాడార్ మోదీ కూతురు నవాజ్ మోదీని గౌతం సింఘానియా పెండ్లి చేసుకున్నారు.
‘గతంతో పోలిస్తే ఈ దీపావళి సంతోషంగా గడపడం లేదు` అని గౌతం సింఘానియా సోషల్ మీడియా ఎక్స్ (మాజీ ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. టెక్స్ టైల్ నుంచి రియల్ ఎస్టేట్ వరకూ పలు రంగాల్లో వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్న రేమండ్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా గౌతం సింఘానియా వ్యవహరిస్తున్నారు.
‘32 ఏండ్ల వైవాహిక జీవితంలో పరస్పర విశ్వాసం, నిబద్ధతతో కలిసి జీవించాం. తల్లిదండ్రులుగా బాధ్యతలు నిర్వర్తించాం. దురదృష్టవశాత్తు మా మధ్య కొంతకాలంగా పలు నిరాధారమైన పుకార్లు వ్యాపించాయి. నా భార్య నవాజ్‌తో విడిపోయినా మా ఇద్దరు కూతుళ్ల భవితవ్యం కోసం పని చేస్తూనే ఉంటాం. మా వ్యక్తిగత గోప్యతను గౌరవించండి’ అని గౌతం సింఘానియా భావోద్వేగపూరితంగా పోస్ట్ రాశారు. తమ విడాకులకు కారణాలను, తమ పిల్లల భవిష్యత్ బాధ్యతలను వెల్లడించలేదు.