న్యూఢిల్లీ, డిసెంబర్ 9: తమ కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత స్పామ్ ఫిల్టర్.. రోజూ 10 లక్షల స్పామర్స్ను గుర్తించినట్టు సోమవారం భారతీ ఎయిర్టెల్ ప్రకటించింది. ఇక గత రెండున్నర నెలల్లో 800 కోట్ల స్పామ్ కాల్స్‌ను, 80 కోట్ల ఎస్ఎంఎస్లను కూడా గుర్తించినట్టు ఈ దేశీయ ప్రైవేట్ రంగ టెలికం సంస్థ ఓ ప్రకటనలో పేర్కొన్నది. దీంతో ఎయిర్టెల్ నెట్‌వర్క్‌పై వచ్చిన కాల్స్‌లో 6 శాతం, ఎస్ఎంఎస్ల్లో 2 శాతం స్పామర్లు చేసినవేనని తేలింది. స్పామ్ కాల్స్ చేసింది, అందుకున్నది రెండింటిలోనూ ఢిల్లీ అగ్రస్థానంలో ఉన్నట్టు సంస్థ వెల్లడించింది. ఢిల్లీ తర్వాత ఏపీ, పశ్చిమ ఉత్తరప్రదేశ్ యూజర్లు స్పామ్ కాల్స్‌ను అధికంగా అందుకున్నారు.
ఢిల్లీ తర్వాత ముంబై, కర్నాటకల నుంచి స్పామ్ కాల్స్ ఎక్కువగా వెళ్లాయి. అలాగే ల్యాండ్‌లైన్ ఫోన్ల నుంచే స్పామ్ కాల్స్ అధికంగా వస్తున్నట్టు కనిపెట్టారు. ఎస్ఎంఎస్ల విషయానికొస్తే.. గుజరాత్, కోల్‌కతా, యూపీల నుంచి ఎక్కువగా వచ్చాయి. ముంబై, చెన్నై, గుజరాత్ వాసులే లక్ష్యంగా ఇవి వెళ్లాయి. పురుష వినియోగదారులే లక్ష్యంగా 76 శాతం స్పామ్ కాల్స్ వచ్చాయి. ఈ ఏఐ పవర్డ్ సొల్యూషన్‌ను రెండున్నర నెలల క్రితమే ఎయిర్టెల్ అందుబాటులోకి తెచ్చింది. కాగా, దీంతో భారతీయ తొలి స్పామ్ ఫైటింగ్ నెట్‌వర్క్‌గా భారతీ ఎయిర్టెల్ నిలిచింది. మొబైల్ వినియోగదారులను విసిగిస్తున్న ఈ అవాంఛిత కాల్స్, సందేశాలకు అడ్డుకట్ట వేయాలని టెలికం సంస్థలను టెలికం రంగ రెగ్యులేటర్ ట్రాయ్ ఆదేశించినది తెలిసిందే.