ఆధునిక ఆర్థిక వ్యవస్థలో క్రెడిట్ కార్డుల (Credit Card) పాత్ర కీలకం. ఏటేటా ఈ కార్డుల వినియోగం అంతకంతకూ పెరుగుతూపోతున్నది చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం ఈ క్రెడిట్ కార్డుల వినియోగదారులు కానివారెవ్వరూ లేరంటే ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. బ్యాంకులు పిలిచిమరీ అందిస్తున్నాయి. అయితే మీ క్రెడిట్ కార్డు.. మీ క్రెడిట్ స్కోర్‌పై (Credit Score) పెద్దగానే ప్రభావం చూపగలదని మీకు తెలుసా? అప్పు కావాలంటే బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ)లు ఈ క్రెడిట్ స్కోర్‌నే ప్రామాణికంగా తీసుకుంటాయి. మీ రుణ పరపతికి కొలమానం ఈ స్కోరే. తీసుకున్న రుణం చెల్లించగలరా? ఆ సామర్థ్యం మీకు ఉందా? అన్నది కూడా ఈ స్కోరే చెప్తుంది. అందువల్ల క్రెడిట్ స్కోర్‌ను (Cibil score) ప్రభావితం చేసే అంశాలపై మీకు తప్పక అవగాహన ఉండాలి.
కార్డు రీ-పేమెంట్ చరిత్ర
క్రెడిట్ కార్డును వాడుతున్నప్పుడు.. మీపై పడే రుణభారాన్ని మీరు ఎలా? ఎప్పుడు? చెల్లిస్తున్నారు అన్నదే ముఖ్యం. ఉదాహరణకు సకాలంలో రుణ చెల్లింపులు చేస్తే మీ క్రెడిట్ స్కోర్ బాగుంటుంది. క్రమేణా పెరుగుతూపోతూ ఉంటుంది. కానీ చెల్లింపులు ఆలస్యం చేసినా లేదా మినిమం పేమెంట్స్‌తో సరిపెట్టినా.. క్రెడిట్ స్కోర్ క్షీణించడం ఖాయం. ఇక రుణ ఎగవేతలకు పాల్పడితే స్కోర్ దారుణంగా దెబ్బతింటుంది. కాబట్టి బకాయిలను సరైన పద్ధతిలో క్రమం తప్పకుండా చెల్లించడం ఉత్తమం.
క్రెడిట్ యుటిలైజేషన్ నిష్పత్తి
మీకు అందుబాటులో ఉన్న రుణ పరిమితి పర్సంటేజీనే క్రెడిట్ యుటిలైజేషన్ రేషియోగా పిలుస్తారు. మీ రుణ పరపతి, క్రెడిట్ స్కోర్ గణనలో ఇది కీలకమైన అంశం. మీ మొత్తం క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్‌లు, బకాయిలను విభజించడం ద్వారా లెక్కిస్తారు. సాధారణంగా ఈ నిష్పత్తి 30 శాతం కంటే తక్కువ ఉంటే బాగున్నట్టు లెక్క.
క్రెడిట్ కార్డుల సంఖ్య
ప్రస్తుతం చాలామందికి ఒకటికి మించే క్రెడిట్ కార్డులు ఉంటున్నాయి. ఎక్కువ కార్డులు ఉంటే మీకు అందుబాటులో ఉండే రుణ సదుపాయం కూడా ఎక్కువగానే ఉంటుంది. దాంతో మీ క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో కూడా తగ్గుతుంది. అయితే మీ క్రెడిట్ స్కోర్ పడిపోయే ప్రమాదం కూడా అధికంగానే ఉంటుంది. కాబట్టి మూడు క్రెడిట్ కార్డుల కంటే ఎక్కువగా వాడకపోవడమే మంచిదన్నది మెజారిటీ ఆర్థిక నిపుణుల సలహా. అధికంగా కార్డులుంటే ఖర్చులు పెరిగి చెల్లింపుల దగ్గర సమస్యలు ఏర్పడుతాయి. దీనివల్ల క్రెడిట్ స్కోర్ తగ్గిపోతుంది. అంతేగాక మీకు రుణ అవసరాలు ఎక్కువగా ఉన్నాయని కూడా రుణదాతలు (బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు) భావిస్తారు. దీనివల్ల కూడా మీకు తక్కువ క్రెడిట్ స్కోర్‌నే వారు ఇస్తారు.
గుర్తుంచుకోండి..
బాగాలేదు ; 300 -579
పర్వాలేదు ; 580-669
బాగుంది ; 670-739
చాలా బాగుంది ; 740 -799
అమోఘం ; 800 – 850