హైదరాబాద్, జూన్ 7: బఫెట్ రెస్టారెంట్ నిర్వహణ సంస్థ బార్బెక్యూ తన వ్యాపారాన్ని శరవేగంగా విస్తరిస్తున్నది. ఇప్పటికే హైదరాబాద్‌లో ఎనిమిది అవుట్లెట్లను నిర్వహిస్తున్న సంస్థ..తాజాగా మరో అవుట్‌లెట్‌ను తెరిచింది. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం అవుట్లెట్ల సంఖ్య 55కి చేరుకున్నాయి. ఈ సందర్భంగా కంపెనీ రీజినల్ హెడ్ రితమ్ ముఖర్జీ మాట్లాడుతూ..కస్టమర్ల నుంచి విశేష స్పందన రావడంతో అవుట్లెట్ల సంఖ్యని పెంచుతున్నట్లు, ముఖ్యంగా హైదరాబాదీలు ఫుడ్ లవర్లు కావడం కూడా సంస్థకు కలిసివస్తున్నదన్నారు.
ప్రస్తు ఆర్థిక సంవత్సరం చివరినాటికి దేశవ్యాప్తంగా మరో 20 అవుట్లెట్లను ఆరంభించాలనుకుంటున్నట్లు ఆయన చెప్పారు. దీంతో అవుట్లెట్ల సంఖ్య 75కి చేరుకోనున్నది. వీటిని వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మంలతోపాటు హైదరాబాద్‌లో ఏఎస్రావు నగర్, వనస్థాలిపురం, అత్తాపూర్, కూకట్‌పల్లితోపాటు రాంచీ, ముంబై, ఢిల్లీ, బెంగళూరు, ఏపీలో రాజమండ్రి, గుంటూరుకి కూడా తన వ్యాపారాన్ని విస్తరించాలనుకుంటున్నది. వచ్చే మూడేండ్లకాలంలో ఐపీవోకి వచ్చే అవకాశాలున్నాయని ఆయన పేర్కొన్నారు.